Breaking News Live:  తాటిపాక పాఠశాలలో కరోనా కలకలం... ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 29న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 29 Oct 2021 08:15 PM
తాటిపాక పాఠశాలలో కరోనా కలకలం... ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణలో, తరగతి గదులు, బెంచీలను అధికారులు శానిటైజ్ చేయించారు. ఉపాధ్యాయులు కరోనా బారినపడిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్ళడంతో రెండు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు.

హుజూరాబాద్ సింగాపూర్ చెక్ పోస్ట్ వద్ద రూ.4.96 లక్షలు సీజ్

 హుజూరాబాద్ ఉప ఎన్నికల కారణంగా శుక్రవారం సింగాపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న 4 లక్షల 96 వేల రూపాయలను పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా TS 08HE 0599 వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.4 లక్షల 96 వేలు నగదును పోలీసులు సీజ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని చెక్ పోస్టులలో స్టాటికల్ సర్వలెన్స్ టీంలు 24 గంటలు పకడ్బంధీగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు డబ్బులు, మద్యం పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం

మాజీ మిస్ తెలంగాణ హాసిని మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. కృష్ణా జిల్లా కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకిన హాసినిని స్థానికులు గమనించి రక్షించారు. సొంతూరు హాసిని తీసుకెళ్లునప్పుడు బైక్ పై నుంచి మున్నేరులో దూకారు. స్థానికులు రక్షించి ఆమెను నందిగామ ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి ఆత్మహత్యాయత్నం చేశారు. లైవ్ చూసి పోలీసులు ఆమె రక్షించారు. 

 చంద్రబాబు కుప్పం సభలో ఉద్రిక్తత 

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం సభలో ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు సభకు రావడంతో టీడీపీ కార్యకర్తలపై అతని దగ్గర బాంబులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. సభలో సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతిపై సీఎం జగన్ సంతాపం

కన్నడ సినీ దిగ్గజం రాజ్‌కుమార్‌ కుమారుడు, ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్ మృతికి సంతాపం తెలిపారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు త‌న ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు. 

ఫీజులు డబ్బులు కొట్టేశాడు... రూ.70 లక్షలతో పరారయ్యాడు

నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర కాలేజీలో విద్యార్థుల ఫీజు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా కాజేసి పరారైపోయిన ఓ ఉద్యోగిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 70 లక్షలు కాజేసి అతను తప్పించుకు పారిపోయాడు. సెప్టెంబర్ 23న ఈ ఘటన జరిగింది. దాదాపు నెలరోజులపాటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం తెలియలేదు. అయితే పోలీసులు అతడి ఫోన్ కాల్ ట్రాప్ చేసి పట్టుకున్నారు. అతని నుంచి రూ.68 లక్షల 50 వేలు రికవరీ చేశారు. దీనిపై నెల్లూరు ఎస్పీ విజయరావు మీడియా సమావేశం ఏర్పాటు వివరాలు తెలియజేశారు.

రాజధాని రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

 


అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. రాజధాని రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ చేపట్టింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని పిటిషనర్ల న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు తెలిపారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు రువ్వే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్నారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. 


 

ఎల్‌బీ నగర్‌లో గంజాయి కలకలం

హైదరాబాద్‌లో మరోసారి గంజాయి కలకలం రేగింది. ఎల్బీ నగర్‌లో ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు గుర్తించారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్టు చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్ర, నాగ్‌పుర్‌కు అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ గంజాయి బయటపడింది.

ఈటలను అడ్డుకున్న పోలీసులు.. బీజేపీ నాయకుల వాగ్వివాదం

మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రెస్ మీట్‌కు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. వరంగల్ గ్రాండ్ హోటల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రెస్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అభ్యర్థి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వీలు లేదని ఏసీపీ గిరి కుమార్ తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై NGT స్టే

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయొద్దని ఆదేశించింది. ఏపీ అభ్యంతరాలను చెన్నై ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. దీంతో కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ స్పష్టం చేసింది. తాగునీటి కోసమని చెప్పి సాగునీటి కోసం నిర్మాణాలు చేపట్టారని పిటిషనర్‌ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ తీర్పు వెలువరించింది.

ఇటలీకి ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు శుక్రవారం బయలుదేరారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో రోమ్​లో జరగనున్న జీ 20 సమావేశంలో పాల్గొంటారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి ఆహ్వానం మేరకు జీ 20 సదస్సుకు హాజరవుతున్నారు. ఇటలీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాన్ని.. పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. జీ 20 సభ్యదేశాలు, ఇతర ఆహ్వానిత దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.

జూబ్లీహిల్స్‌లో భారీ దొంగతనం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కాంట్రాక్టర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

మెరుగ్గానే రజినీ ఆరోగ్యం

సూపర్ స్టార్ రజినీ కాంత్‌ ఆరోగ్యంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్‌ స్పందించారు. ‘‘రజినీకాంత్‌ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయిస్తుంటాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు’’ అని ప్రకటించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Background

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఉన్నట్టుండి ఆస్పత్రిలో చేరడంపై అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశం బయటికి రాకపోవడంతో అందరూ కంగారు పడ్డారు. ఈ క్రమంలో తాజాగా ఆయన భార్య రజినీ ఆరోగ్యంపై ఓ ప్రకటన చేశారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్‌ చెకప్‌లో భాగంగానే రజినీ కాంత్ ఆసుపత్రికి వెళ్లారని స్పష్టత ఇచ్చారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్‌ బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ చిత్రాన్ని కుటుంబ సభ్యుల మధ్య చూశారు.


గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు రావడంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌ స్పందించారు. ‘‘రజనీకాంత్‌ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయిస్తుంటాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు.


Also Read: Merupu Murali Trailer: ‘మెరుపు మురళి’ ట్రైలర్.. విలేజ్ సూపర్ హీరోగా టొవినో థామస్.. ఇతడో అల్లరి ‘పిడుగు’


ఆయన కొన్ని గంటల తర్వాత ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ఒకరకమైన ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజనీ కాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా కావేరి ఆస్పత్రికి వచ్చారు.


Also Read: Sumanth's Malli Modalaindi Trailer: దొంగ సచ్చినోడా... ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా!


మరోవైపు, రజినీ కాంత్ ఇప్పటిదాకా ఉన్న చివరి చిత్రం 'దర్బార్'. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' అనే సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో 'పెద్దన్న' అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ ని, టీజర్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు. మద్రాస్, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 


Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.