Breaking News Live: జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 18 Oct 2021 09:03 PM
దళిత బంధు కింద రూ.250 కోట్లు విడుదల

దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం కోసం సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు  రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. రూ.100 కోట్ల నిధులను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి, రూ. 50 కోట్లను సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలానికి, రూ. 50 కోట్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా

రేపు జరగాల్సిన ‘జగనన్న తోడు’ కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ సెలవు కావడంతో ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని అజయ్‌జైన్‌ తెలిపారు.

హుజూరాబాద్ లో దళితబంధుకు బ్రేక్...

హుజూరాబాద్ లో దళితబంధుకు బ్రేక్ పడింది. ఉపఎన్నిక దృష్ట్యా దళిత బంధు పథకాన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈసీ లేఖ రాసింది.  

కారుణ్య నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

కొవిడ్‌ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశించారు. వచ్చే నెల నవంబర్‌ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. 

గురుకుల పాఠశాలల ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్

తెలంగాణలో గురుకులాల ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. గురుకులాల ప్రారంభంపై గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం.. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మిగతా పాఠశాలలు నడుస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. పరిస్థితుల దృష్ట్యా పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టును కోరింది. బుధవారం పిల్‌ విచారణను పరిశీలిస్తామని సీజే ధర్మాసనం తెలిపింది. 

రౌడీ షీటర్ తోట శేఖర్ హత్య కేసులో నిందితులు అరెస్ట్‌

తెలంగాణ జగిత్యాల పట్టణంలో ఈ నెల 16న రౌడీ షీటర్‌ తోటశేఖర్‌ ను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దసరా రోజు తోట శేఖర్‌ను మద్యం తాగించి కత్తితో దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన సమిండ్ల మహేశ్‌, వీరబత్తిని సాయికిరణ్‌ను నిందితులుగా గుర్తించి పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు. వారి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన మహేశ్‌, వీరబత్తిన సాయికిరణ్‌పై రౌడీ షీటర్‌ తెరిచినట్లు డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు. 

టీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ కండువా కప్పి మోత్కుపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ నెల 19న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ సెలవును అక్టోబర్‌ 20వ తేదీకి బదులుగా 19కి మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆదివారం యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సెలవు రోజును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం సెలవును మార్పు చేసి ఉత్తర్వులు జారీ చేసింది.

వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మడమనేరి గ్రామంలోని పొలాల్లో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి చెందింది. దీనిని గమనించిన రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ‌దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను పరిశీలించి మెడకు బైక్ ఎక్సలెటర్ వైర్ బిగించి ఉండడంతో వైర్ ను విడిపించారు. మృతి చెందిన చిరుతను పోస్టుమార్టమ్ చేసి పాతిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు అడవి జంతువుల కోసం ఉచ్చు బిగించిన వేటగాళ్లపై అటవీ శాఖ అధికారులు గ్రామస్తులతో ఆరా తీస్తున్నారు.

తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ రానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో మోత్కుపల్లి నర్సింహులు చేరనున్నారు. పార్టీ కండువా కప్పి మోత్కుపల్లిని టీఆర్ఎస్‌లోకి సాధరంగా ఆహ్వానిస్తారు.

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ నెల 19న హైద‌రాబాద్ నుంచి ఉద‌యం 11:30 గంట‌ల‌కు యాదాద్రి బ‌య‌ల్దేర‌నున్నారు. యాదాద్రి పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి పునఃప్రారంభ తేదీల‌ను సీఎం కేసీఆర్ ప్రక‌టించ‌నున్నారు. యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఆ తేదీనే కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున:ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్రక‌టించే అవకాశం ఉంది.

ముగ్గురు యువకులు గల్లంతు.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‎పూర్‎లో స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి ఈత కోసం దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానిక బందంకొమ్ము చెరువులోపడి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే, సరదాగా ఐదుగురు యువకులు పుట్టిలో కూర్చొని చెరువులోకి వెళ్లారు. ఒక్కసారిగా మధ్యలోనే పుట్టి మునగడంతో మొత్తం ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఐదుగురిలో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురికి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మృతులు పవన్ (34), నర్సింహులు (36)గా గుర్తించారు.

ఢిల్లీకి బండి సంజయ్.. ప్రచారానికి ఆహ్వానం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిస్థితులను బండి సంజయ్‌ అధిష్టానానికి వివరించనున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి అమిత్‌ షా, జేపీ నడ్డాతోపాటు పలువురు జాతీయ స్థాయి నేతలను బండి సంజయ్‌ ఆహ్వానించనున్నారు.

ప్రైవేటు బస్సు దగ్ధం

జనగామ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు అగ్నికి ఆహుతైంది. ఛత్తీస్‎ఘడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా ఇంజన్‎లో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్‎లో పొగ రావడం గమనించి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 26 మంది ప్రయాణికులు సకాలంలో సురక్షితంగా బయటపడగలిగారు. బస్సులో నుంచి పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగుతుండడం వల్ల అగ్ని మాపక సిబ్బందికి ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.