ACB Cases In Telangana :  తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. లంచం తీసుకుంటున్నారు అనే ఫిర్యాదు వస్తే స్థాయితో సంబందం లేకుండా అందర్నీ పట్టుకుంటున్నారు. పై స్థాయి అధికారులు లంచాలతో వందల కోట్లు వెనకేసినా పట్టుకుంటున్నారు. ప్రజలకు సేవలు చేయాల్సిన అధికారులు అందు కోసం లంచాలను తీసుకుంటున్నా వదిలి పెట్టడం లేదు. ఎంత మొత్తం అవినీతి అని కాదు.. లంచం అనే మాట వినిపిస్తే దూకుడుగా వెళ్లి అవినీతి పరుల్ని పట్టుకుంటున్నారు. 


 





 
ఇంటి పన్ను అసెస్‌మెంట్ చేసి, ఇంటి నెంబర్ కేటాయించడానికి పదివేలు లంచం తీసుకుంటున్న ఎల్‌బీ నగర్ టాక్స్ ఇనస్‌పెక్టర్ ను సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పాస్ బుక్ ఇవ్వడానికి రైతు దగ్గర డబ్బులు వసూలు చేసిన తహశీల్దార్ ని, నిర్మల్ లో బిల్ కలెక్టర్ ని.. ఎవరైనా సరే .. ఎంత పెద్ద మొత్తం అన్నది ఆలోచించకుండా పట్టేసుకుంటున్నారు. 


 





 
ఇంతకు ముందు హైచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ బాలకృష్ణ, ఏసీపీ ఉమామహేశ్వరరావు లాంటి పెద్ద స్థాయి వ్యక్తుల్ని వదిలి పెట్టలేదు. 


 





 
ప్రభుత్వం మారినప్పటి నుండి ఏసీబీ చాలా దూకుడుగా వ్యవహరి్సతోంది.   గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతోపాటు ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టిన ఆఫీసర్ల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన పోలీస్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్  ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తున్నారు.  గడిచిన ఐదున్నర నెలల్లో  దాదాపుగా  60 ఏసీబీ కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది.  రోజుకు ఇద్దరు, ముగ్గురు ఆఫీసర్లను ఏసీబీ వలపన్ని పట్టుకుంటున్నది.


 ఎవరైనా ప్రభుత్వాధికారి లంచం అడిగితే వెంటనే ఏసీపీకి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. రిపోర్ట్ చేయాల్సిన నంబర్  1064. అవినీతి నిర్మూలన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏసీబీ అధికారులు గుర్తు చేస్తున్నారు.