Telagana Elections 2023 :  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడది ఓ ప్రత్యేక స్థానం. ఈ సారి మిర్యాలగూడలో హోరాహోరీ పోరు సాగుతోంది. 1956లో నియోజకవర్గంగా ఏర్పడిన మిర్యాలగూడ కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. ఏడు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మొదటి నుండే నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టిపట్టు ఉంది. కానీ భాస్కరరావు కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ెస్ లోకి వెళ్లాక కాంగ్రెస్ బలహీనపడింది. 


ప్రభుత్వ వ్యతిరేకతతో బీఆర్ఎస్‌ అభ్యర్థికి సమస్యలు


ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి సాకుతో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.  తనకున్న రాజకీయ అనుభవంతో మూడోసారి అధికారంలోకి రావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  కెసిఆర్ ప్రభంజనం గా ఉన్న కొత్త రాష్ట్రంలో ఉన్నప్పటికీ మిర్యాలగూడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం విశేషం. టిఆర్ఎస్ నుండి రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన భాస్కరరావు గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని అభివృద్ధి చూసి ఓటేయాలని  కోరుతున్నారు.  కానీ ప్రజల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదనీ కేవలం కొందరికి మాత్రమే అందుతున్నాయని  ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు ఉన్నాయి.  ఎలాగైనా ఈసారి మిర్యాలగూడలో  గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలవడమే కాకుండా తాను గెలిస్తే మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. 


బత్తుల లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ లో ఉత్సాహం


కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన భాస్కర్ రావు టిఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ నుండి సరైన నాయకుడు లేకపోవడంతో కొంతవరకు బలహీన పడిందని చెప్పుకోవచ్చు కానీ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో  నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో స్థానికులకి  టికెట్టు ఇవ్వకుండా చివరి వరకు ఎటు తేల్చని అధిష్టానం నామినేషన్ల రోజు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ బి ఫామ్ అందజేసింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయినప్పటికీ, ఎట్టకేలకు  అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కష్టపడి దాదాపు 45 వేల ఓట్లు సాధించారు. అయినప్పటికీ కాంగ్రెసు కు ఓటమి తప్పలేదు.ఈసారైనా అభ్యర్థుల కేటాయింపులో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటారని అంతా భావించారు. అభ్యర్థుల కేటాయింపు కోసం సమాయత్తమవుతున్న సమయంలో సామాజిక సేవ వేత్త కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్( బిఎల్ఆర్ ) బత్తుల లక్ష్మారెడ్డి కు టికెట్ ఇవ్వడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కు తగిన నాయకుడిగా ఎన్నుకున్న అధిష్టానం ఈసారి ఎలాగైనా తన ద్వారా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారనే నమ్మకంతో టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈసారి తన పట్టు సాధించాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. సంస్థాగత కాంగ్రెస్ బలం ఆయనకు ప్లస్ పాయింట్.


పోటీలో సీపీఎం కూడా ! 
 
మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత సిపిఎం పార్టీ  కూడా గట్టి పట్టు ఉంది.  జూలకంటి రంగారెడ్డి స్థానికుడు కావడంతో ప్రజలుతో మమేకమై నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా గుర్తింపు ఉంది. కమ్యూనిస్టులు ఇక్కడ ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజల్లో ఎర్ర జెండాపై ఉన్న పోరాటాల పటిమను చూపారు. కమ్యూనిస్టులు ప్రజల మద్దతుతోనే గతంలో ఐదుసార్లు విజయం సాధించారు. మధ్యలో వారు కొంత పొత్తులో భాగంగానే గెలుపొందారు. 1994లో టిడిపి తో, 2004లో కాంగ్రెస్ పార్టీతో, 2009లో మహాకూటమిలో భాగంగా మిర్యాలగూడ నుండి సిపిఎం విజయాలు సాధించగా జూలకంటి రంగారెడ్డి కొంతమేరకు నియోజకవర్గాన్ని,  బడుగు బలహీన వర్గాలను కూడా అభివృద్ధి చేసి చూపించారు. జూలకంటి రంగారెడ్డి సిపిఎం పార్టీలో కీలకమైన వ్యక్తిగా వ్యవహారాలు చక్కబెట్టడంలో దిట్ట. అందులో భాగంగానే వామపక్షాల పొత్తుతో  సిపిఎం కి మిర్యాలగూడ టికెట్ వస్తుందని ఆశించారు కానీ ఆఖరిలో కాంగ్రెస్ పార్టీకి కేటాయించడం తో సిపిఎం పార్టీ నుండి బరిలో ఉన్నారు.


కాంగ్రెస్ లో ఐక్యతతో ఆ పార్టీకి ప్లస్ పాయింట్


కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యమద్దత ఉండకపోవడం తనకు కలిసి వచ్చే అవకాశం గా భావించిన భాస్కరరావుకు చేదు అనుభవం ఎదురైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గంలో  నాయకుల మధ్య ఐకమత్యం  లేకపోవడం తన గెలుపు ఈజీ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులను కుందూరు జనారెడ్డి సమక్షంలో ఏకాభిప్రాయానికి రావడం ఈసారి కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యాలని దృఢమైన సంకల్పంతో ఉన్నారని ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కరరావు నిలబడతారా..? లేదా కాంగ్రెస్ పార్టీ నుండి బత్తుల లక్ష్మారెడ్డి అసెంబ్లీకి వెళ్ళనున్నారా...? అనేది డిసెంబర్ మూడో తేదీన తేలనుంది.