Teenmar Mallanna handing over his assets to Telangana government- నల్లగొండ: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలన ఘటన జరిగింది. జర్నలిస్ట్, యువనేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను, తన కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చి సంచలనానికి తెరలేపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకున్న రూ.1.50కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న చెప్పిన పని చేసి చూపించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా చింతపండు నవీన్ నామినేషన్
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) శుక్రవారం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా ఆయన గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏ రాజకీయ నాయకుడు చేయని పని చేసి చూపించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడితే తన పేరిట, కుటుంబం పేరు మీదున్న ఆస్తులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి, పాలిటిక్స్ లోకి వస్తానని గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. నేడు (మే 3న) ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో తమ కుటుంబం మొత్తం ఆస్తులను బాండ్ పేపర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
తనపై గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఆఫీసుపై దాడులు జరిగినా వెనకడుకు వేయని తత్వం తీన్మార్ మల్లన్నది. తాను మాటల మనిషి కాదని, చేతల మనిషినని నిరూపిస్తూ.. గతంలో ఇచ్చిన మాట మేరకు తన కుటుంబం మొత్తం ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి అప్పగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్న తీన్మార్ మల్లన్న.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టైమ్ ఇస్తే పత్రాలు సమర్పిస్తానని తెలిపారు. పారదర్శకంగా రాజకీయాలు చేయాలని భావించి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. కానీ తీన్మార్ మల్లన్న, మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ ఓట్లు చీల్చారు. కానీ చివరికి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు రాగా, గెలిచిన అభ్యర్థి పల్లాకు 1,61,811 ఓట్లు పోలయ్యాయి. సొంతంగా బరిలోకి దిగినా తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్స్ భారీగానే ఓట్లు వేశారు. కానీ ఏ పార్టీ సపోర్ట్ లేకపోవడంతో కేవలం 3 శాతం ఓట్ల తేడాతో చింతపండు నవీన్ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిచెందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ ఓటమి కోసం గతంలో పోరాటం చేసిన ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చింది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో తీన్మార్ మల్లన్న బరిలోకి దిగుతున్నారు.