తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పార్టీ అధిష్ఠానం మార్చుతుందని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ స్పష్టత ఇచ్చారు. బండి సంజయ్ తీరుపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్న మాట అవాస్తవమని తరుణ్ చుగ్ అన్నారు. అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చడం అనేది ఉండబోదని స్పష్టత ఇచ్చారు. అధ్యక్షుడి మార్పు అంశం అనేది అసలు బీజేపీ హైకమాండ్  దృష్టిలో లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ అన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్న వేళ ఈ సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఎలా చేస్తామని అన్నారు. ప్రస్తుతం పార్టీలో ముఖ్య నేతలందరికీ కీలక బాధ్యతలు ఉంటాయని చెప్పారు. దీనిపై ఇంతకుముందే స్పష్టత ఇచ్చామని, అయినా ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. 


రెండు వారాల క్రితం కూడా తరుణ్ చుగ్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోను బండి సంజయ్ నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని అధ్యక్షుడ్ని మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నడం అభూత కల్పనగా కొట్టిపడేశారు. రాష్ట్ర నాయకత్వం సమష్ఠిగానే పనిచేస్తుందని తరుణ్ చుగ్ వెల్లడించారు. 


ఇటీవల తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ ను హైకమాండ్ వరుసగా రెండు, మూడు సార్లు ఢిల్లీ పిలిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను తెలంగాణలో బీజేపీ చీఫ్ ను చేస్తారని.. బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం ప్రారంభం అయింది.                        


అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి మార్పులు పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం వినిపించడంతో హైకమాండ్ వెనక్కి తగ్గినట్లగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ కు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవి కావొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ నేతలు.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారికి బండి సంజయ్ నే కొనసాగిస్తున్నామని స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చారు.