Telangana BJP :  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ చుగ్ ముగింపు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోను బండి సంజయ్ నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని అధ్యక్షుడ్ని మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిందన్నారు.బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నడం అభూత కల్పనగా కొట్టిపడేశారు.                         

  


 నితీష్ నేతృత్వంలో విపక్షాల భేటీకి కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారన్నారు. దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారన్నారు. పై స్థాయిలో అంతా కలిసి పని చేస్తారని.. రాష్ట్రానికి వచ్చే సరికి విమర్శలు చేసుకుంటారన్నారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ల సంస్కృతి ఇదేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీ టీంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బీ టీంగా, కొన్నిసార్లు సి టీంలో కూడా కాంగ్రెస్ పార్టీనే పోటీ పడుతోందని తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని  తరుణ్ చుగ్ తెలిపారు.                      


అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానుందని వెల్లడించారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల సమరంలో ఉంటారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయన్నారు. రాష్ట్ర నాయకత్వం సమిష్టిగానే పనిచేస్తుందని తరుణ్ చుగ్ వెల్లడించారు. ఇటీవల తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ ను హైకమాండ్ వరుసగా రెండు, మూడు సార్లు ఢిల్లీ పిలిపించడంతో ఆయనను బీజేపీ చీఫ్ ను చేస్తారని.. బండి సంజయ్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ప్రారంభమయింది.                        


అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి మార్పులు పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం వినిపించడంతో హైకమాండ్ వెనక్కి తగ్గినట్లగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ కు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవి కావొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ నేతలు.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారికి బండి సంజయ్ నే కొనసాగిస్తున్నామని స్పష్టమైన  సంకేతాల్ని ఇచ్చారు. ఇక ఆ పార్టీ సీనియర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి  .