Suspension On Telangana BJP Leaders Who Is Likely In Modi Cabinet: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో మరో 30 మంది ఎంపీలకు పైగా కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ నుంచి ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్‌లో బెర్తులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇటీవల ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది.
ఆ ఇద్దరికీ ఛాన్స్
తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishanreddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు (Bandi Sanjay) కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. కాగా, గత కేబినెట్‌లోనూ సికింద్రాబాద్ నుంచి విజయం సాధించి కిషన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. అటు, తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ వారికి దగ్గరగా ఉన్న నేతలు, కేంద్ర పెద్దలతో మంత్రి పదవుల కోసం చర్చలు జరిపారు. అయితే, ఎట్టకేలకు ఉత్కంఠ వీడి ఆదివారం మోదీ కేబినెట్‌లో.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.