Supreme Court  cancel Kodandaram MLC post : కోదండారం, అమీర్ అలీ ఖాన్‌లు మాజీ ఎమ్మెల్సీలు అయ్యారు. గవర్నర్ కోటాలో వారి నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వం తాజాగా నామినేట్ చేసే పేర్లు కూడా తుది తీర్పునకే లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. 

2023 ఆగస్టులో, భారత రాష్ట్ర సమితి  ప్రభుత్వం దాసోజు శ్రవణ్ మరియు కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే, అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నామినేషన్లను సెప్టెంబర్ 19, 2023న "రాజకీయ సంబంధం ఉన్న వ్యక్తులు" అనే కారణంతో తిరస్కరించారు. ఆ తర్వతా కాంగ్రెస్ సీఎం కేసీఆర్ ఎవర్నీ నామినేట్ చేయలేదు. మళ్లీ వారి పేర్లే పంపితే గవర్నర్ కచ్చితంగా ఆమోదించాల్సి ఉండేది. కానీ పంపలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి.                    

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి 2024 జనవరి 27న ప్రొఫెసర్ ఎం. కోదండారాం , జర్నలిస్ట్  అమీర్ అలీ ఖాన్ లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. గవర్నర్ ఈ నామినేషన్లను ఆమోదించారు. అయితే   దాసోజు శ్రవణ్ ,  కుర్ర సత్యనారాయణ గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు బెంచ్  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెప్టెంబర్ 2023లో శ్రవణ్, సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరించిన ఆదేశాన్ని రద్దు చేసింది, గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) కింద మంత్రిమండలి సలహా మేరకు పనిచేయాలని పేర్కొంది.  కోదండరాం ,  అమీర్ అలీ ఖాన్‌ల నామినేషన్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది.            

అయితే మళ్లీ కేబినెట్ కొత్తగా సిఫారసు చేయవచ్చని తెలిపింది. దీంతో మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లను తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసింది.  దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేశారు. విచారణలో కోదండారాం ,  అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ నియామకాలపై ఆంక్షలను సుప్రీంకోర్టు తొలగించింది. దాంతో వీరిద్దరూ వారు ఆగస్టు 16, 2024న తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.   

అయితే తమనే ఎమ్మెల్సీగా నియమించేలా ఆదేశాలు ఇవ్వాలన్న శ్రవణ్, కుర్ర సత్యనారాయణలకు నిరాశే ఎదురయింది. ఎమ్మెల్సీలను సిఫారసు చేయాల్సింది కేబినెట్ కాబట్టి  అలాంటి ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేయలేదు. అందుకే.. తాజా నియామకాలు కూడా తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దాసోజు శ్రవణ్ ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.