ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో భాగంగా గత మార్చి నెలలో ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణకు నోటీసులు ఇచ్చిన విషయంలో ఓ మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా అనే దానిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్సీ కవిత పక్షాన నిలిచింది. ఈడీపై కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.


విచారణ కోసం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. మహిళను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం విచారణ చేసింది. కవిత పిటిషన్ ను పరిగణలోకి తీసుకుని.. ఆ పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. 


ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహద్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్ రావు కూడా హాజరు అయ్యారు.