Telangana High Temperatures: మార్చి నెల రానేలేదు... మాడు పగలగొట్టేస్తున్నాయి ఎండలు. ఫిబ్రవరి మెుదటివారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఓవైపు భానుడి భగభగలు.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు  అల్లాడిపోతున్నారు. బయట అడుగుపెడితే... కాళ్లు మాడిపోతున్నాయి. మాడు పగిలిపోతోంది. ఇవేం ఎండలురా బాబోయ్‌ అంటూ జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే... నడి వేసవిలో పరిస్థితి ఏంటని భయపడిపోతున్నారు.  సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఎండలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తాయి. ఏప్రిల్‌లో దంచికొడతాయి. కానీ... ఈఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. బయటికి వెళ్తే.. తాట తీసేస్తున్నాడు. 


తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ   గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు దాటేసింది. ఈ ఎండలకే తట్టుకోలేకపోతుంటే... వాతావరణ శాఖ... మాడుపగలగొట్టే మరో వార్త మోసుకొచ్చింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది.. ఎండలు మరింత ముదురుతాయని వెదర్‌ రిపోర్ట్‌ చెప్తోంది.  ఈ వార్త విని జనం మరింత బెంబేలెత్తుతున్నారు. ఈ ఎండలను ఎలా తట్టుకోవాలో అంటూ... తలలు పట్టుకుంటున్నారు. వేసవి మొదలే కాలేదు... ఇప్పుడు ఎండ వేడి భరించలేకపోతున్నామని వాపోతున్నారు. 


నిన్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువ కావడంతో ప్రజలు కూడా రోడ్ల మీదకు రావడానికి భయపడిపోతున్నారు. రాత్రి వేళ కూడా ఉక్కపోత తప్పడం లేదు. ఇప్పటి నుంచే ఇళ్లలో ఏసీలు, కూలర్లు... తెగ వాడేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే చల్లని గాలులు వీస్తున్నాయి. తర్వాత భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. 


అయితే.. ఇందులో కాస్త ఉపశమనం కలిగించే వార్త కూడా ఉంది. నాలుగు రోజులు ఎండలు దంచికొట్టిన తర్వాత.... ఐదు నుంచి ఆరు రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందట. ఉదయం, రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌  వాతావరణ కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పింది. ఆ కొన్ని రోజులు కాస్త సేదతీరగానే... మళ్లీ భానుడు  విరుచుకుపడతాడని హెచ్చరిస్తోంది వెదర్‌ రిపోర్ట్‌. ఫిబ్రవరి 16వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతూనే పోతాయని తెలిపింది. 


హైదరాబాద్‌ విషయాన్ని వస్తే... ఈఏడాది కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఖాయమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే... పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉకిరిబికిరి అవుతున్నారు. ఇక... మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో  పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా... గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న (గురువారం) జూబ్లీహిల్స్‌లో 38.6 డిగ్రీలు, సరూర్‌నగర్‌, చందానగర్‌లో 38.5,  బేగంపేటలో 37.2, ఉప్పల్‌లో 37.6, శేరిలింగంపల్లిలో 37.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు నిపుణులు. లేదంటే వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటి నుంచే హెచ్చరిస్తున్నారు.