Hyderabad News: హైదరాబాద్ లోని మియాపూర్ దీప్తిశ్రీ నగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీప్తిశ్రీనగర్ సర్వే నంబర్ 100,101 లో ఉన్నటువంటి  ప్రభుత్వ స్థలంలో  నిరుపేదలు వందలాదిగా గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు ఖాళీ చేయించేందుకు పోలీసులు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడిసెలను ఖాళీ చేసేందుకు అక్కడి ప్రజలు నిరాకరించారు. ఇక్కడి నుంచి వెళితే మాకు నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  గత ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని వాపోయారు. కనీసం ఈ ప్రభుత్వమైనా స్పందించి తమకు అక్కడే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  


ప్రచారంతో భారీగా తరలివచ్చిన జనం
అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న  గుడిసెలు తొలగించి..  ఖాళీ చేయించేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శేరి లింగంపల్లి మండలం మియాపూర్​ పరిధిలో హెచ్ఎండీఏ భూమి ఉంది. ఇక్కడ ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారనే ప్రచారంతో  రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక్కడ దాదాపు రెండు వేల మంది వరకు గుడిసెలు వేసుకుని మూడు నాలుగు రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం హెచ్ఎం డీఏ అధికారులు మియాపూర్​ పోలీసులతో కలిసి వారిని ఖాళీ చేయించేందుకని వెళ్లారు. ముందుగా అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నించారు. ప్రభుత్వాలు ఇళ్లు ఇస్తామని హామీలు ఇస్తున్నాయి, కానీ అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 


స్థలాలు ఇచ్చే వరకు కదిలేదే లేదు
తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు అక్కడి నుంచి  కదిలేది లేదని బైఠాయించారు. సాయంత్రం వరకు హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మియాపూర్​ఏసీపీ నర్సింహారావు వెళ్లి గుడిసెలు వేసిన వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.  ఆ స్థలంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందన్నారు.  ప్రస్తుతం ఇది హెచ్​ఎండీఏ అధీనంలో ఉందని వారికి వివరించారు.  స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే తమపై కేసులు నమోదు చేయాల్సి వస్తుందని వారిని  హెచ్చరించారు. అయినా అక్రమణదారులు తగ్గకుండా స్థలాలు ఇచ్చేవరకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.  దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.  


పోలీసులపై రాళ్లు పరిస్థితి ఉద్రిక్తం
గుడిసెలు ఖాళీ చేయించేందుకు వచ్చిన పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగి వారిపై రాళ్లు రువ్వారు.  దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తమకు ఇళ్ల  స్థలాలు కేటాయించాలని శుక్రవారం వందలాది మంది మహిళలు శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని  ముట్టడించారు.  దీప్తిశ్రీనగర్​ నుంచి తహసీల్దార్​ ఆఫీసు వరకు భారీ ర్యాలీగా తీశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటంతో నగర శివార్లలో చాలా చోట్ల పేదలు గుడిసెల్లోనే నివసిస్తున్నారు. మరి, ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి. 


Also Read: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి