Rajaiah looks towards Congress :  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.  మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దామోదర రాజనర్సింహతో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య రహస్యంగా భేటీ అయినట్టుగా బయటకు తెలియడంతో రాజయ్య అనుచరుల్లో చర్చ ప్రారంభమయింది.  హన్మకొండ జిల్లా నయీంనగర్‌లోని ప్రెసిడెంట్‌ దాబాలో మాదిగ ఇంటలెక్చువల్స్‌ సదస్సు సోమవారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు దామోదర రాజనర్సింహతో పాటు తాటికొండ రాజయ్య సైతం హోటల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎదురుపడిన వారిద్దరూ మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం హౌటల్‌లో రహస్యంగా రాజనర్సింహతో రాజయ్య సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు.  ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లోకి వెళ్తారని అనుకుంటున్నారు. 


కాంగ్రెస్​ నేతలతో ప్రత్యేక సమావేశానికి ముందు తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై పక్క పక్కనే కూర్చొని కనిపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో జరిగిన రామాలయ వేడుకకు ఇద్దరు నేతలు హాజరయ్యారు. వేడుకలో ఇద్దరు పక్కపక్కనే  కూర్చొని కనిపించారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ మారతారన్న ప్రచారంతో పాటు..సెప్టెంబర్ 4వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రాజయ్యతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చిన  దాస్యం వినయ్ భాస్కర్..ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. 


రాజయ్యతో పలు విషయాలపై వినయ్ భాస్కర్ చర్చించారు. పార్టీ విషయాలు మాట్లాడేందుకే రాజయ్య దగ్గరకు వచ్చానని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. రాజయ్య టికెట్ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉద్యమకాలం నుంచి పనిచేసిన నాయకుడు రాజయ్య అని పేర్కొన్నారు.  మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసమే తాను దామోదర రాజనర్సింహను కలిశానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దాంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని వివరించారు. తాను పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా అందరూ సహకరించాలని కోరారు. 


స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలడంతో సీఎం కేసీఆర్ మరో సీనియర్ నేత కడియం శ్రీహరికి టిక్కెట్ ప్రకటించారు. రాజయ్యకు టిక్కెట్ నిరాకరించారు. అప్పట్నుంచి ఆయన .. సామాజికవర్గం కార్డుతో రాజకీయాలు చేస్తున్నారు. ఓ సారి మందకృష్ణ మాదిగను తన ఇంటికి పిలిచి అనుకూలంగా స్టేట్ మెంట్  ఇప్పించుకున్నారు. కుల సంఘాల సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తన సామాజికవర్గం అంతా తనకు ఉండాలని కోరుతున్నారు. టిక్కెట్ ఇవ్వకబోతే తాను ఊరుకోనని ఖచ్చితంగా పోటీ చేస్తానన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికీ తనకే టిక్కెట్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.