Telangana Local Elections preparations: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TGSEC) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ (MPTC), జిల్లా పరిషత్ (ZPTC) ఎన్నికలకు ముసాయిదా ఓటర్ల జాబితా విషయంలో అభ్యంతరాలు స్వీకరణ తేదీలను ప్రకటించింది.
సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటన
ముసాయిదా ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితా ప్రకారం పేరు, చిరునామా, మరణాలు, కొత్తగా నమోదు వంటి మార్పు చేర్పులు ఉంటే చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 28న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అదే రోజు నుంచి 30తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ తుది జాబితా ఆధారంగానే గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, MPTC, ZPTC సభ్యుల ఎన్నికలను నిర్వహిస్తారు.
దాదాపుగా మూడు కోట్ల ఇరవై లక్షల మంది ఓటర్లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 3.17 కోట్లు ఉండగా, పురుషులు 1.58 కోట్లు, మహిళలు 1.58 కోట్లు, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణల కోసం TSEC వెబ్‌సైట్ (https://tsec.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలు నమోదు చేస్తే వార్డు వారీగా జాబితా కనిపిస్తుంది. తుది ఓటర్ల జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఎన్నికల తేదీలు, నామినేషన్లు, అభ్యంతరాలు, ఓటింగ్ వివరాలు త్వరలో ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి.
సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019లో జరిగాయి. వాటి పదవి కాలం ముగిసినా ఎన్నికలు పెట్టలేదని కొంత మంది కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలాఖరులోపు పంచాయతీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు చెప్పింది. అయితే ఈ హామీ ఇచ్చి రెండు నెలలు అవుతున్నా ఇంకా అధికారిక ప్రక్రియ పూర్తి కాలేదు. మరో నెల రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. రెండో తేదీ కల్లా ఓటర్ల జాబితా ప్రకటిస్తున్నందున అదే వారంలో ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.