Special Trains to Medaram Jathara: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం (Medaram) సమ్మక్క, సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. జాతర సందర్భంగా ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని తెలిపారు. ఈ సర్వీసులు సికింద్రాబాద్ - వరంగల్, నిజామాబాద్ - వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ - వరంగల్ మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాల్లోని భక్తులకు.. ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.


సర్వీసుల వివరాలు



  • 07017/07018: సిర్పూర్ కాగజ్‌నగర్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్‌నగర్

  • 07014/07015: సికింద్రాబాద్ - వరంగల్ - సికింద్రాబాద్

  • 07019/07020: నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్


అలాగే, 07023/07024 ఆదిలాబాద్ - వరంగల్ - ఆదిలాబాద్ మార్గంలోనూ మేడారం భక్తుల కోసం ప్రత్యేక రైలు నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు ఆదిలాబాద్, అంబారీ, కిన్వట్, ధనోరా, భోకర్, ముద్‌ఖేడ్, బాసర్, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, హసన్‌పర్తి మీదుగా వరంగల్ చేరుకుంటుంది. తిరిగి ఇదే మార్గంలో ఆదిలాబాద్ వెళ్తుంది.


'నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. సమ్మక్క - సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతో పాటు జాతర ఏర్పాట్ల కోసం రూ.3 కోట్లను కేటాయించింది' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 


భక్తుల కోసం ప్రత్యేక రైడ్


ఈ నెల 21 నుంచి 24 వరకూ వన దేవతల జాతర జరగనున్న నేపథ్యంలో.. అమ్మల దర్శనం మరింత సులభతరం చేసేలా, జాతర అద్భుత దృశ్యాన్ని చూసేలా హెలికాఫ్టర్ సేవలు ఈసారి కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా, భక్తులు ఓ ప్రత్యేక అనుభూతి పొందేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు గగన విహారం చేస్తూ వనదేవతలను దర్శించుకునే భాగ్యాన్ని కల్పించింది.


టికెట్ ధరలివే


హైదరాబాద్, హనుమకొండ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మేడారం వరకూ హెలికాఫ్టర్ సర్వీసులను నడపనున్నారు. మేడారం పరిసర అందాలను వీక్షించేందుకు భక్తుల కోసం ప్రత్యేకంగా మేడారంలో హెలికాఫ్టర్ జాయ్ రైడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సేవలందించిన ప్రైవేట్ సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. మేడారంలో జాయ్ రైడ్ కోసం రూ.4,800గా టికెట్ ధర నిర్ణయించారు. వరంగల్ నుంచి మేడారానికి వెళ్లి తిరుగు ప్రయాణానికి రూ.28,999గా అధికారులు నిర్ణయించారు. ఒక్కో ట్రిప్ లో ఐదుగురికి ప్రయాణించే అవకాశం ఉంది. కాగా, ఈసారి హెలికాఫ్టర్ సేవలను హనుమకొండ నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ టికెట్ ధర నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హెలికాఫ్టర్ సేవలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని.. హెలికాఫ్టర్ సేవలు కూడా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


18 నుంచి ప్రత్యేక బస్సులు


మేడారం మహా జాతరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా టెంపరరీ ఆపరేటింగ్ పాయింట్ల పనులు ముమ్మరం చేశారు. ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


Also Read: Trains Cancelled: పట్టాలు తప్పిన గూడ్స్ - పలు రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన