ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి వచ్చేశాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. ప్రస్తుతం మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లా వ‌ర‌కు రుతుపవ‌నాలు విస్తరించిన‌ట్లుగా వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఎండాలంలో వేడి, ఉక్కతో సతమతం అవుతూ అప్పుడప్పుడూ కురిసిన వర్షాలకు కాస్త సేద తీరిన ప్రజలకు ఇక పూర్తి చల్లని వాతావరణం పలకరించనుంది. ఈ నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో రాష్ట్రానికి మూడు రోజుల పాటు వ‌ర్ష సూచ‌న ఉండనున్నట్లు అధికారులు ప్రక‌టించారు. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలిక‌పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చాలా చోట్ల మంగళ, బుధవారాల్లో వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. 


కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు పెద్ద వర్షాలే పడనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదే విధంగా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అంతేకాక, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలు తదుపరి రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.


‘‘ఈ రోజు హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కానీ రేపటి నుంచి వర్షాల జోరు నగరంలో పెరగనుంది. రుతుపవనాలు కాస్తంత బలపడనుంది కాబాట్టి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. మరో వైపున రానున్న రెండు, మూడు రోజుల్లో తల్లవారిజామున మధ్యాంధ్ర జిల్లాలు - గుంటూరు, కృష్ణా, ఉత్తర ప్రకాశం, బాపట్ల​, విజయవాడ​, ఏలూరు, ఉభయ గోదావరి, కాకినాడ జిల్లాల్లో వర్షాలుంటాయి.



‘‘వైజాగ్ నగరంలో అంతగా వర్షాలు కనిపించడం లేదు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళంలో వర్షాలు సాయంకాలం సమయంలో కురుస్తాయి. రేపటి నుంచి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. నెల్లూరు, తిరుపతి, కడప​, అన్నమయ్య జిల్లాల్లో మరో మూడు రోజుల దాక రాత్రి వర్షాలు. కర్నూలు, అనంతపురం, సత్య సాయి జిల్లాల్లో కూడ రాత్రి, అర్ధరాత్రి వర్షాలు చెదురుముదురుగా పడుతాయి.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.