SIT team questioned Harish Rao for seven Hours: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు ఏడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ,ఇటీవల విచారణ ఎదుర్కొన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఓ టీవీ చానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నించారు.
ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా హరీష్ రావుపై ప్రశ్నలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంటెలిజెన్స్ అధికారులతో మీకు ఉన్న సంబంధం ఏమిటి? ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సమయంలో లేదా ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా? అన్న కోణంలో ప్రధానంగా ప్రశ్నలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు , ఆ సమయంలో జరిగిన కాల్ డేటా సేకరణపై హరీష్ రావును అధికారులు వివరణ కోరినట్లు తెలుస్తోంది.
అంతా చట్టబద్ధంగానే జరిగిందని హరీష్ చెప్పినట్లు ప్రచారం సిట్ ప్రశ్నలకు హరీష్ రావు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదేళ్లలో మేము చట్టానికి లోబడే పనిచేశాం, ఏ అధికారికి కూడా ఇలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇవ్వలేదు అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇతర నిందితుల వాంగ్మూలాలను ఉటంకించినప్పుడు.. వారిపై ఒత్తిడి తెచ్చి లేదా ప్రలోభపెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఉండవచ్చు అని ఆయన కొట్టిపారేసినట్లు చెబుతున్నారు.
డైవర్షన్ కోసమేనని హరీష్ ఆరోపణలు
విచారణకు వెళ్లే ముందు ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని తాను బయటపెట్టినందుకే ఈ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు సహకరిస్తామని చెప్పారు. అయితే, హరీష్ రావు ఇచ్చిన సమాధానాలపై సిట్ అధికారులు సంతృప్తి చెందారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన సమాధానాలను ఇప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలతో సరిపోల్చిన తర్వాత, సిట్ మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.