Kerala cardboard boxes: కేరళలో ఒక యువకుడు తప్పుడు లైంగిక ఆరోపణల కారణంగా ప్రాణాలు తీసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అట్టపెట్టెలు పట్టుకుని నిరసన తెలపడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. కేరళలోని కోజికోడ్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసేవాడు. జనవరి 16న పయ్యన్నూర్ వెళ్తున్న బస్సులో దీపక్ తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ ఒక మహిళ 18 సెకన్ల వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు అతడిని దారుణంగా ట్రోల్ చేశారు, బస్సులో కామాంధుడు అంటూ ముద్ర వేశారు. పోలీసులకు ఫిర్యాదు అందకముందే సోషల్ మీడియాలో జరిగిన ఈ డిజిటల్ విచారణ తో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
దీపక్ మరణం తర్వాత ఈ కేసులో అసలు నిజం బయటపడింది. ఆ వీడియోలో దీపక్ తప్పు చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, కేవలం తనను చూశాడనో లేదా పొరపాటున చేయి తగిలిందనో ఆ మహిళ తప్పుడు ప్రచారం చేసిందని అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా విచారణ , సోషల్ మీడియా ట్రోలింగ్ బాధితులకు సంఘీభావంగా యువత అంతా అట్టపెట్టెలను తలకు తగిలించుకుని లేదా చేతుల్లో పట్టుకుని నిరసన తెలుపుతున్నారు.
దీపక్ ఆత్మహత్యకు కారణమైన మహిళపై కేరళ పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య ప్రేరణ కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు విచారణకు వెళ్లేసరికి ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేసిందా అన్న కోణంలో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటన కేరళలో పురుషుల హక్కుల గురించిన చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది. సాక్ష్యాధారాలు లేకుండా కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపిస్తోంది. అందుకే మలయాళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సామాన్య ప్రజలు అందరూ ఏకమై మగాళ్లకూ గౌరవం ఉంటుంది అంటూ ఈ అట్టపెట్టెల నిరసనను కొనసాగిస్తున్నారు.