MLA ‎Palvai Harish Babu: ఇటీవల కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల్లో రెండు పులులు చనిపోవడంతో అటవీశాఖ (Forest official)తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధ్యులైన అధికారులపై చర్యలు సైతం తీసుకున్నారని తెలిసిందే. అయితే కాగజ్ నగర్ అటవీ ప్రాంతాల్లోని పులుల సంరక్షణలో అటవీశాఖ అధికారులకు అందరూ సహకరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. అలాగే అటవీశాఖ అధికారులు సైతం పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సైతం సూచించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని వంజిరి గ్రామంలో మంగళవారం పులిదాడిలో మరణించిన పశువుల యజమానులకు చెక్కుల పంపిణీ మరియు అవగాహన సదస్సును అటవీ శాఖ అధికారులు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిర్పూర్ ఎమ్మెల్యే (Sirpur MLA) డా.పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఎమ్మేల్యే డా. హరీష్ బాబు మాట్లాడుతూ.. పులులకు క్రిమిసంహారక మందు, దాంతో పాటు కరెంట్ వైర్లు పెట్టి పులులను అంతమొందించడం దారుణమన్నారు. రైతులేవరూ ఇటువంటి హానికర చర్యలకు పాలుపడవద్దని సూచించారు. అలాగే పోడు రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న అటవీ భూముల విషయంలో అటవీశాఖ అధికారులు కూడా ఇబ్బంది పెట్టడం మానుకోవాలని,వారి జీవన భృతి విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఉన్న భూమిని వదిలేది లేదు, కొత్త భూమిని కొట్టేది లేదు అనే నినాదాన్ని గ్రామస్థులు, రైతులు మరియు అటవీశాఖ అధికారులు అమలు చేయాలని  సూచించారు.


అనంతరం పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు చెక్కుల పంపిణీ మరియు స్కూల్ పిల్లలకు అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ నీరజ్ కుమార్, జెడ్పీ ఇంఛార్జి చైర్మన్ కోనేరు కృష్ణ రావు, రూరల్ సిఐ నాగరాజు, FRO రమాదేవి, ఎస్ఐ సానియా, సర్పంచ్ లు ముంజం రమేష్, పుల్ల అశోక్, జంగు మరియు లబ్దిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.