Batukamma Sarees : తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమయింది. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 1.10 కోట్ల చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.333 కోట్లు కేటాయించారు. బతుకమ్మ చీరెలను ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని జిల్లాలకు పంపనున్నారు. మహిళల అభిరుచికి అనుగుణంగా చీరెలను రూపొందించారు. ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో మొత్తం 289 వర్ణాలతో చీరెలను తయారుచేశారు. చీరలకు డాబీ అంచు ఉండటం ఒక ప్రత్యేకతగా అధికారులు అంటున్నారు. వచ్చే నెల 25వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో, వార్డుల్లో బతుకమ్మ చీరలను లబ్దిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 18 ఏళ్లు దాటిన నిరుపేద మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు. ఈ ఏడాది చీరల పంపిణీ చేపట్టేందుకు జనవరిలోనే చీరెల తయారీని ప్రారంభించింది. ప్రతి నెలా 90 లక్షలకు పైగా చీరలను తయారుచేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ 


వచ్చే నాలుగు రోజుల్లో 20 లక్షల చీరలు ఉత్పత్తి కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ చీరెల తయారీకి సిరిసిల్లలోని 16 వేల మంది చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 15 వేల పైగా కేంద్రాల ద్వారా ప్రజాప్రతినిధులు చీరలను పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్లలోని రేషన్ షాపులకు సమీపంలో కేంద్రాలను ఏర్పాటుచేసి చీరలు పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో రేషన్ డీలరు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీలు, నగరాలు, పట్టణాల్లో రేషన్ డీలరు, పురపాలక బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. గత ఏడాది వరంగల్ జిల్లాలోని టెస్కో గోదాములో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకని ముందుజాగ్రత్తగా అన్ని గోదాముల్లో ఫైర్ సెఫ్టీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మండల స్థాయి గోదాముల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 


బతుకమ్మ పండుగకు 


తెలంగాణలో దసరా పండుగకు ముందు బతుకమ్మ పండుగ నిర్వహించడం రాష్ట్ర ప్రజల సంప్రదాయం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగలా నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని ఆడపడుచులకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా కోటి 10 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల నుంచి లబ్దిదారులకు అందజేసేందుకు అన్నీ జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈసారి బతుకమ్మ చీరల సరికొత్తగా రూపొందించారు. 


Also Read : Telangana Power : తెలంగాణలో కరెంట్ కోతలు తప్పవా ? ప్రభుత్వం ఏం చేయబోతోంది ?


Also Read : Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ