Minister KTR : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ పోరు బాట పట్టింది. తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు రోడ్ల పైకి నిరసనలు చేపట్టారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నిర్వహించిన రైతు దీక్షకు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు బాంధవ్యుడు సీఎం కేసీఆర్ ఉన్నా ఇవాళ రైతులు మళ్లీ ధర్నాలు చేపట్టాల్సిన పరిస్థితి కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రధాని కాకముందు ఛాయ్ పే చర్చ అన్నారని, కానీ ఇవాళ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన చర్చ, పార్లమెంట్ లో తెలంగాణ ధాన్యం గురించి చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వీటిపై చర్చ తప్పా ఇవాళ దేశంలో ఛాయ్ పే చర్చ లేదన్నారు.  


ప్రధాని మోదీకి చేతకావడంలేదా?


"సిలిండర్ రూ.వెయ్యి అయింది. కట్టెలు పొయ్యి దిక్కు అయింది." అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారం లేనప్పుడు గ్యాస్ ధరలపై స్మృతి ఇరానీ, నిర్మలా సీతరామన్ నిరసన చేసి పేదల వ్యతిరేకమైన ప్రభుత్వం అని అప్పటి కాంగ్రెస్ పై విమర్శలు చేశారన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారం నుంచి దిగిపోవాలన్నారు. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ రోడ్డెక్కి చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లు ఉంటే ఇప్పుడు కూడా 105 డాలర్లే ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆ రోజు పెట్రోల్ ధర రూ.70.51పై, డీజిల్ ధర రూ.53.78పై కానీ ఈ రోజు పెట్రోల్ ధర లీటర్ రూ.120 ఉంటే, డీజిల్ ధర రూ.104 ఉందన్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ దిగిపోమ్మని డిమాండ్ చేసిన మోదీకి ఇప్పుడు చేతకావడంలేదా అని కేటీఆర్ విమర్శించారు. 







పీయూష్ గోయల్ పార్లమెంట్ లో అబద్ధాలు చెబుతున్నారు


"ఇవాళ పెట్రోల్, డీజిల్ ధర తగ్గించమని కేంద్రాన్ని అడిగితే రాష్ట్రాల్లో తగ్గించుకోండి అంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధర్ ఇవాళ పెరిగిపోవడానికి కారణం ప్రధాని మోదీ ప్రభుత్వం. ఆనాడు రూ.450 ఉండే గ్యాస్ సిలిండర్ ఇనాడు రూ.1000లకు చేరిందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ పై ఉన్న రూ.లక్ష కోట్ల సబ్సిడీ తొలగించందన్నారు. పెరిగిన ముడి చమురు ధరలకు రష్యా, ఉక్రెయిన్ ధరలకు ఏమి సంబంధం ఉంది. రష్యా నుంచి ఒక్క శాతం మాత్రమే తెచ్చుకుంటున్నాం. కానీ రష్యా-ఉక్రెయిన్ వార్ ను వంకగా చెబుతున్నారు. కేంద్రం ధరలు పెంచిందని ప్రశ్నిస్తే దేశద్రోహి అని ముద్రవేస్తున్నారు. ఇవాళ ధాన్యం కొనుగోలుపై కొట్లాడుతున్నాం. తెలంగాణ బియ్యం కొనమని కేంద్ర పీయూష్ గోయల్ ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఉప్పుడు బియ్యానికి గిరాకీ లేదని పీయూష్ గోయల్ అంటున్నారు. కానీ భారత ప్రభుత్వం కోటి మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. కానీ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుద్ధ తప్పులు చెబుతున్నారు. నూకల తినండని కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతులను కించపరిచేలా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు." మంత్రి కేటీఆర్ అన్నారు. 


ప్రతీ గింజ కొంటామన్న నేతలెక్కడ?


ప్రతీ రంగంలోనూ కేంద్రం మోసం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులను రెచ్చగొట్టి మాట్లాడిన బీజేపీ నేతలు ఇవాళ ఎక్కడికి పోయారన్నారు. పండించిన ప్రతీ గింజను కొంటామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఎందుకు కొనిపించడంలేదన్నారు. మీకు చేతగాకపోతే సీఎం కేసీఆర్ కు అప్పగిస్తే దేశం వ్యాప్తంగా ఉద్యమం చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.  మోదీ సర్కార్ ప్రతి రంగంలో ప్రజలను మోసం చేస్తోందన్నారు. రేపు రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలన్నారు. ఆ సెగ దిల్లీకి తాకాలన్నారు. ఈ నెల 11న దిల్లీలో రాష్ట్ర మంత్రులు ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.