తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారులను బారీకేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నేడు తెలంగాణ కాంగ్రెస్ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉండగా, ఆయన్ను ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు బూటకంగా నిరసనలు చేస్తుంటే వారికి అనుమతి ఇచ్చిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ రహదారులన్నీ దిగ్భందం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నిలదీశారు.






కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ వరుస ఉద్యమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ రోజు విద్యుత్ సౌధ, పౌర సరఫరాల కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే, రేవంత్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి, దాసోజు శ్రవణ్‌, హర్కర వేణుగోపాల్‌, బక్క జడ్సన్‌, నగేశ్‌ ముదిరాజ్‌ తదితరులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.


గురువారం కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా పన్నునొప్పి పేరుతో తన అక్రమాల, అవినీతి సొమ్ములకు వచ్చే పన్నుల నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో పడుకుంటారు కానీ.. ప్రధానిని మాత్రం కలవడని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సిగ్గులేకుండా ధరల పెరుగుదలకు నిరసనగా జాతీయ రహదారులను దిగ్బంధిస్తూ ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 






రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్లే ధర్నాల పేరుతో రోడ్ల మీద డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడైనా ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ను తగ్గించాడా?, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాయని గుర్తు చేశారు.