Minister KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ ను మంత్రి సందర్శించారు.  అభ్యర్థులకు రూ.2 లక్షల స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు.  త్వరలోనే జిల్లా కేంద్రంలో శాశ్వత బీసీ స్టడీ సర్కిల్ భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సిరిసిల్లలో 500 మందికి ఎస్సీ స్టడీ సర్కిల్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 500 మందికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సినారె కళా మందిరంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. 1000 మందికి పైగా ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. మరో 134 స్టడీ సర్కిల్ లను సీఎం మంజూరు చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. 


సాగు, తాగు నీటి రంగంలో 


తెలంగాణ ఏర్పాటై 8 ఏండ్లు అయ్యింది. నిధులు, నీళ్లు, నియామకాలు కోసమే ఉద్యమం జరిగింది.  గోదావరి, కృష్ణా జలాలు, 60 వేల పైగా చెరువులు ఉండేవి. చిత్త శుద్ధి లేని నాయకత్వం వల్ల సాగు , తాగు జలాలకు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాగు జలాలు అటుంచి తాగు నీటికి గోస పడే పరిస్థితులు ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు, తాగు నీరు రంగంలో స్వయం సమృద్ధి సాధించాం. 75 ఏళ్లలో ఎవ్వరూ చేయని పని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు ఇచ్చాం. 40 కోట్ల ఎకరాల సాగుకు భూమి అందుబాటులో వచ్చింది. 70 వేల టీఎంసీల నీరు నదులలో అందుబాటులో ఉంది. ఒక టీఎంసీతో 10 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఒక పక్క సమృద్ధిగా నీరు, మరో పక్క దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయి. గత పాలకులకు సోయి లేక పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. - మంత్రి కేటీఆర్ 


సిరిసిల్ల శిక్షణ ఐఏఎస్ లకు ఓ పాఠం 


తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ, కాళేశ్వరం, సహా అనేక ప్రాజెక్ట్ లు నిర్మించామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దేశంలోనే ధాన్యపు భాండగారంగా మారిందన్నారు. జిల్లాలో మధ్య మానేరు జలాశయం, అన్నపూర్ణ నిర్మించామన్నారు. సాగునీటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్వయం సంవృద్ధి సాధించిందన్నారు. శిక్షణ ఐఏఎస్ లకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు పెరిగిన భూగర్భ జలం ఓ పాఠంగా మారిందన్నారు. 2014 తెలంగాణ వచ్చిన కొత్తలో తలసరి ఆదాయం రూ.1,24,000 ఉంటే ఇప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,000 కు పెరిగిందని తెలిపారు. ఈ పెరుగుదల 130 శాతం ఉందన్నారు. జాతీయ తలసరి ఆదాయం రూ.1,49,000 మాత్రమే అన్నారు.  తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర GSDP రూ.5,60,000 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.11,55,000 కోట్లకు చేరి 128 శాతం పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు.  


దేశానికి ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ 


దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఆర్థికంగా అభివృద్ధి సాధించడం వల్లే గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 8 ఏళ్లలో  భారత దేశానికి ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ రాష్ట్రం మారింది. 8 ఏళ్లలో భారతదేశానికి టాక్స్ ల రూపంలో రూ.3,65,797 కోట్లు ఇచ్చాం. దేశం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చింది. దేశ నిర్మాణంలో తెలంగాణ గొప్ప పాత్ర పోషిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే అయినా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కలిస్తున్నాం. మొదటి 5 ఏళ్లలో 1,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రెండో దఫా 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేశాం. దేశంలో 35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు  ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్నాయి. ప్రధాని 10 లక్షల పోస్ట్ ల భర్తీ చేస్తామని ప్రకటన చేశారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు.