Siricilla News: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకొని అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగ్లోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దొళ్ల స్వామి, అదే జిల్లాకు చెందిన గొల్లపెళ్లి రాములు, అనిల్ అలాగే  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన నరేందర్ లు మూడ్రోజుల నుంచి దుబాయ్ విమానాశ్రయంలో నరకం అనుభవిస్తున్నారు. 


ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటేనే..


దుబాయ్ లోని ఓ కంపెనీ.. సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇచ్చారు. అయితే ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ఐదుగురు యువకులకు కంపెనీ షాక్ ఇచ్చింది. ఏజెంట్లు చెప్పిన పని, జీతం వేరడవంతో కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేం ఈ పని చేయలేమంటూ గొడవ పడ్డారు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులను పిలిపించి.. తాగొచ్చి గొడవ చేస్తున్నారని కేసు బుక్ చేయించారు. ఈ క్రమంలోనే కంపెనీ నిర్వాహకులు.. ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటే ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. దీంతో బాధితులు ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకున్నారు.  


పాస్ పోర్టులు చెక్ చేసి కేసులున్నాయని వెనక్కి..


బాధితుల పాస్ పోర్టులు ఇచ్చేసి వాళ్లను ఎయిర్ పోర్టు వద్ద వదిలేశారు. అయితే శనివారం రోజు రాత్రి వాళ్లు ఇండియాకు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐదుగురు యువకులు పాస్ పోర్టులు, టికెట్లు తీసుకొని ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు. ఐదుగురికి విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ పూర్తయింది. కానీ అక్కడి పోలీసులు వాళ్ల పాస్ పోర్టులు చెక్ చేసి.. మీ పైన కేసులు ఉన్నాయి, మీరు ఇండియాకి వెళ్లరాదని చెప్పి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించారు. ఏం చేయాలో పాలుపోని యువకు ఇటు ఏజెంట్లు అటు కంపెనీ నిర్వాహకులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎయిర్ పోర్టు వద్దనే  కూర్చొని యువకులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు వారికి ఏమవుతుందో ఏమోనని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరిని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.


"అన్నా మేం ఓ కంపెనీలోకి వచ్చి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. అందరం కలిసి ఎయిర్ పోర్టు ముందుటున్నం అన్నా. మేం. తినడానికి కూడా పైసల్ లేవు. నీళ్లకు కూడా లేవు. మూడ్రోజులు అయితుందన్న అన్నం తినక, నీళ్లు తాగక. ఇక్కడనే ఎయిర్ పోర్టు ముందుటున్నమన్న. ఈరోజు ఇంటి నుంచి పైసల్ ఏపిచ్చుకోని టికెట్ బుక్ చేస్కొని ఇక్కడికి వస్తే ఎయిర్ పోర్టు బోర్డింగ్ అయిన తర్వాత టికెట్ చింపేశి బయటకు పంపిచ్చిర్రు. అన్నా కేటీఆర్ అన్న నువ్వే దయతోటి మమ్మల్ని ఇండియాకి రప్పిచ్చేటట్టు చెయ్యన్న."






స్పందించిన మంత్రి కేటీఆర్..


ఇదే విషయాన్ని వీడియోలో వివరిస్తూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి కేసీఆర్.. యువకులు సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ.. దుబాయ్ లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కు రీట్వీట్ చేశారు.