సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో సిబ్బంది ఆరు బయటే కూర్చొని విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఎమ్మార్వో కార్యాలయానికి సేవల కోసం వచ్చిన స్థానికులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇలా ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి ఉంటే ఇక సామాన్యులకు ఏం సేవలు అందుతాయని చర్చించుకున్నారు. అసలేం జరిగిందంటే..


సంగారెడ్డి జిల్లాలో సిర్గాపూర్ మండల తహసీల్దార్‌ కార్యాలయానికి రోజూ వందల మంది రెవెన్యూ సంబంధిత పనుల కోసం వస్తూ ఉంటారు. రోజులాగా అక్కడికి వచ్చిన జనానికి కార్యాలయానికి తాళం వేసి ఉండడం కనిపించింది. సిబ్బంది కూడా తాళం వేసి ఉండడంతో బయటే పడిగాపులు కాశారు. అసలు విషయం స్థానికులు ఆరా తీయగా.. విచిత్ర సమస్య వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ భవనం అద్దె కట్టకుండా ఉండడంతో ఆగ్రహానికి గురైన భవన యజమాని తాళాలు వేసి వెళ్లిపోయాడు. అప్పటికే తనకు దాదాపు రూ.లక్షన్నరకు పైగా అద్దె కట్టాల్సి రావడంతో విసుగు చెందిన యజమాని తాళాలు వేసినట్లుగా గుర్తించారు. 


సోమవారం సిర్గాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఆఫీస్‌ సిబ్బంది, ప్రజలు కార్యాలయం బయటే చాలా సేపు కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన తహశీల్దార్ రత్నం.. భవన యజమాని నర్సింహులుతో మాట్లాడారు. అయితే, అద్దె విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని అందుకే తాళం వేశానని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఆర్డీఓ రాజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడిన యజమాని 15 రోజుల్లో అద్దె మొత్తం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయం తాళాలు తెరిచారు. ఆగస్ట్‌ 18వ తేదీ నాడే కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానని, అయినా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని భవన యజమాని తెలిపారు.


2016లో కొత్త మండలంగా సిర్గాపూర్
కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా సిర్గాపూర్‌లో 2016 అక్టోబరులో ప్రైవేటు భవనంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఏశబోయిన నర్సింహులు, సాయిలుకు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసినట్లు ఇంటి యజమాని తల్లి నర్సమ్మ తెలిపారు.


Also Read: KTR: కేటీఆర్ పెద్దమనసు.. జీహెచ్ఎంసీ స్వీపర్‌ రజినికి ఉన్నత ఉద్యోగం, ఉత్తర్వులు జారీ


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! దిగొచ్చిన పసిడి ధర, స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇవి..