పీజీ చదివి జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న ఓ మహిళ దశ తిరిగింది. మంత్రి కేటీఆర్ ఆమె గురించి తెలుసుకొని తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆమె అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని పురపాలక శాఖను ఆదేశించారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాసులో పాసైన రజిని అనే యువతి గతి లేని పరిస్థితుల్లో నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్.. ఔట్‌సోర్సింగ్ విధానంలో రజినికి అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్‌గా నియమింపజేశారు. ఈ మేరకు సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రజిని ప్రగతి భవన్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌లను కలిసి తనకు ఉద్యోగం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెస్సీలో ఉన్నతస్థాయి మార్కులతో పాసైన రజినికి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. రజనికి సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అర్హత కూడా వచ్చింది. కానీ కుటుంబ భారం ఆపేసింది. భర్తకు చిన్న వయసులోనే గుండెజబ్బు రావడం, స్టెంట్లు వేయడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు ఇబ్బంది ఏర్పడడంతో గతిలేని పరిస్థితుల్లో రోడ్లు ఊడ్చే పని చేస్తున్నారు.
షాపిగ్ మాల్స్‌లో చిన్నపాటి ఉద్యోగం చూసుకుందామనుకున్నా.. కరోనా కారణంగా అది కూడా ఫలించలేదు. చివరకు పది వేల జీతానికి కాంట్రాక్టు స్వీపరు ఉద్యోగంలో చేరారు. అందులో రెండు వేలకు పైగా రాకపోకలకే ఖర్చవుతుంది. ఆమె నిస్సహాయ పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆమె విద్యార్హతలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీలోనే అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్‌గా ఉద్యోగం ఇప్పించారు.