Singareni Workers Dasara Bonus 2023:

  
హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ఇస్తోంది. కార్మికులకు దసరా బోనస్‌ లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.53 లక్షల బోనస్‌ ఇవ్వనున్నట్టు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. నిధులు విడుదల కావడంతో కార్మికుల ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్‌ జమ కానుంది. కార్మికులకు బోనస్ లో భాగంగా సింగరేణిలోని 42 వేల మంది కార్మికులు ఒక్కొక్కరు రూ.1.53లక్షల చొప్పున బోనస్‌ అందుకోనున్నారు. 


ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, డీఏ విడుదల వంటి నిర్ణయాలు తీసుకుంటూ వారిని కూడా సంతృప్తి పరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ సర్కార్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించింది. దసరా కానుకగా వీటిని అందించనుంది. ఇటీవల బోనస్ ప్రకటించగా.. నిధులు కూడా విడుదలకు ఆమోదం లభించింది. కార్మికులకు బోనస్ ఇచ్చేందుకు రూ.711.18 కోట్ల నిధులను రిలీజ్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.


ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో త్వరలోనే సింగరేణి కార్మికుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. దసరా పండుగకు ఒకట్రెండు రోజుల ముందే బోనస్ నగదు జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఒక్కో సింగరేణి కార్మికుడికి దాదాపు రూ.1.53 లక్షల దసరా బోనస్ అందనుంది. దీంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ ప్రకటించినందుకు ప్రభుత్వానికి  ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే ప్రతీ ఏడాది పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్ ఇస్తూ ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల సందర్బంగా బోనస్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ సారి ఎన్నికలు ఉండటంతో కొంచెం ముందుగానే బోనస్ నిధులు విడుదల చేస్తున్నారు. ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే నిధులు విడుదల చేయడానికి వీలు పడదు. విడుదల చేయాలని భావించినా.. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే బోనస్ నిధులు విడుదల చేసింది.


సింగరేణి ఎన్నికలు వాయిదా..
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు 2 నెలలపాటు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లోపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై సింగరేణి యాజమాన్యం సవాల్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో వేళ సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలను వాయిదా చేయాలని రిక్వస్ట్ చేసింది. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతానికి ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. డిసెంబర్ 27 ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. నవంబర్‌ 30 లోపు ఎన్నికల తుది జాబితాను సిద్ధం చేసి కార్మిక శాఖకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 


ఆరు జిల్లాల్లో 15 యూనిట్లు ఉన్నాయి అందులో 40 వేల మంది కార్మికులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న వేళ సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలకు సహకరించలేమని ఆయా జిల్లాల కలెక్టర్లు చెప్పారు. కార్మిక సంఘాలు కూడా వాయిదాకు సమ్మతించాయి. దీంతో ఎన్నికలను కోర్టు వాయిదా వేసింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది.