AITUC won against INTUC In Singareni Elections 2023: తెలంగాణలో సింగరేణి (Singareni Elections) గుర్తింపు సంఘ ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటింది. ఆ పార్టీ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ విజయం సాధించింది. ఏడాదిన్నరగా సాగుతున్న హడావిడికి అర్థరాత్రితో తెరపడింది. ఇప్పుడు సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయబావుటా ఎగరేసింది. ఈ సంఘం ఐఎన్‌టీయూసీపై భారీ ఆధిక్యంతో విజయం సాధించింది.
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఎన్నికలు జరగ్గా ఆరు చోట్ల ఏఐటీయూసీ విజయం సాధించగా.. ఐదు స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ గెలుపొందింది. దీంతో ఏఐటీయూసీ తెలంగాణ సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది.
ఎక్కడ ఎవరు గెలిచారు?
మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామగుండం 1,2 ప్రాంతాల్లో ఏఐటీయూసీ గెలుపొందింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, రామగుండం మూడో ఏరియాలో ఐఎన్‌టీయూసీ ఆధిక్యత ప్రదర్శించింది. ఒక్క శ్రీరాంపూర్‌లో రెండు వేలకుపైగా ఓట్లు ఏఐటీయూసీకి వచ్చాయి. ఈ సింగరేణి ఎన్నికల్లో 2012, 2017లో బీఆర్‌ఎస్ అనుబంధ విభాగం టీజీబీకేఎస్ గెలుపొందింది. ఈసారి ఆ సంఘం ఎన్నికలకు దూరంగా ఉంది.
11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం లెక్కింపు ప్రారంభమైంది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 39వేల 773 మంది కార్మికులకు ఓటు హక్కు ఉండగా... 37వేల 447 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడగా ఏఐటీయూసీ పైచేయి సాధించింది. కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ల మధ్యే పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా పోటీ నుంచి బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పుకుంది. దీంతో సీపీఐకి బాగా కలిసి వచ్చింది.
సింగరేణి ఆరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 11 డివిజన్‌లలో ఎన్నికలు జరిగాయి. 94.15 శాతం పోలింగ్ నమోదు అయింది. సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. 1998 నుంచి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. గుర్తింపు సంఘం కాలపరిమితి 2 సంవత్సరాలు. దీనిపై వివాదం కొనసాగుతూనే ఉంది.
ఐఎన్‌టీయూసీ తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో వరాలు గుప్పించారు. అయితే ఖమ్మం ఏరియాలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా ప్రాంతాల్లో చతికిల పడింది.