Minister Harish Rao : కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ గజ్వేల్, సిద్ధిపేట ప్రతినిధుల సభలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ను తిట్టడం అంటే తినే కంచంలో ఉమ్మేసుకోవడమే అన్నారు. ఏం తక్కువ చేశారని సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధు, దళిత బంధు ఇలా ఎన్నో పథకాలు చేపట్టిన కేసీఆర్ ను తిట్టడానికి నోరు ఎలా వస్తుందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను తిడితే పెద్ద లీడర్లు అవుతామన్న ఫీలింగ్ ఉన్నారని, కానీ ప్రజలు మిమ్మల్ని సహించరన్నారు. ప్రజలంతా కేసీఆర్‌ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టేది ఖాయమన్నారు. తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ మార్పు వచ్చిందంటే కేసీఆర్‌ కృషేనని హరీశ్ రావు తెలిపారు.  


గవర్నర్ పై విమర్శలు 


గవర్నర్‌ తమిళిసై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న గవర్నర్‌ను తెలంగాణ బిడ్డగా ప్రశ్నిస్తున్నానన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ కి రావాల్సిన ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు అడ్డుకొని గజ్వేల్ అభివృద్ధికి గవర్నర్ అడ్డుపడ్డారని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ విధానాలతో దేశంలో ఉన్న సంపద బయట దేశాలకు తరలి పోతోందని ఆక్షేపించారు. దేశం నుంచి బయట దేశాలకు పౌరులు వలస వెళ్లిపోతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. యువత, విద్యార్థులు ఎక్కడికక్కడ మనం చేసిన అభివృద్ధిని చెప్పాలని, గ్రామాల్లో చర్చ జరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకపోతే జిల్లాలు ఏర్పడేవా అని ప్రశ్నించారు. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ వచ్చేవా? అన్నారు. ఇవన్నీ సీఎం కేసీఆర్‌ చలవతోనే అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.  


కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు- మంత్రి కేటీఆర్ 


ముఖ్యమంత్రి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో లేరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని అన్నారు. దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని, వస్తున్నాయని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి పల్లె ప్రగతి కార్యక్రమంతోనే సాధ్యం అయిందని తెలిపారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.