Sharmila In Delhi :   వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ చేరుకున్నారు.  కాంగ్రెస్‌లో  తన పార్టీని విలీనం చేసే అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ అంశంపై చర్చలు పూర్తి చేశారు. హైకమాండ్‌తో తుది చర్చల కోసం షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా షర్మిల కలిసే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఆమె ట్వీట్లు పెడుతున్నారు.


విలీనంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదా ? 


వైఎస్ఆర్ తెంలగాణ పార్టీని ప్రారంభించిన  షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే అనుకున్నంతగా ఊపు రాకపోవడం.. తెలంగాణలో నేతలెవరూ పార్టీలో చేరకపోవడంతో ఆమె పార్టీని నడిపించడంలో ఇబ్బంది పడుతున్నారు. షర్మిల తప్ప ఆ పార్టీలో మరో నేత కనిపించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. తనకు పాలేరు టిక్కెట్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తాననే ప్రతిపాతన పెట్టారంటున్నారు. అయితే పాలేరు  కాదు కానీ సికింద్రాబాద్ నుంచి  పోటీ చేయమని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ విషయంలో ఇంకా ఎటూ చర్చలు తేలలేదంటున్నారు. 


ఏపీ రాజకీయాల్లో అయితే కీలక పాత్ర పోషించే అవకాశం 


ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే మాత్రం ఆ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుందని భావిస్తున్నారు.  రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచే సీఎం అయ్యారు. కానీ ఆయన ఓటు బ్యాంకును ఇటు ఏపీలో కానీ.. అటు తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయింది. రాజన్న తమ వాడు అని చెప్పుకోలేకపోయింది. ఆయన కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరూ జగన్ వైపు చూడగా.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అటు రాజశేఖర్‌రెడ్డిని తమ వాడు అని వాడుకోలేక నాయకత్వ లేమితో ఇబ్బందిపడ్డారు. రాజన్న బిడ్డగా షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. పోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవచ్చని హస్తం అధిష్టానం ఆలోచిస్తోంది. మరోవైపు జగన్‌పై పోరాటానికి షర్మిలనే అస్త్రంగా వాడుకోవాలని డిసైడైంది. 


షర్మిల అన్నింటికి సిద్ధపడితే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు                  


కాంగ్రెస్ లో చేరి అన్నను సైతం డీ కొట్టాలని నిర్ణయించుకుంటే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు  వస్తాయి. ఇప్పటివరకూ విజయమ్మ మద్దతు కూడా షర్మిలకే ఉండడం ఆమెకు కలిసొచ్చిన అంశమనే చెప్పాలి. కానీ తన బిడ్డలు చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని అంటున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడితే ఎవరికి మద్దతిస్తారో స్పష్టత లేదు. ఏపీలో కూడా విజయమ్మ కాంగ్రెస్ కే మద్దతు పలికితే జగన్ మోహన్ రెడ్డికి ఓ రకంగా షాకే. కానీ ఇటీవల సీఎం జగన్ .. విజయమ్మను మళ్లీ వైఎస్ఆర్‌సీపీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.