Ys Sharmila : తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నువ్ కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు నటిస్తా అన్నట్లుగా రెండు పార్టీల నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్ అవినీతి శక్తి’ అని మోదీ బహిరంగంగా విమర్శించారని..‘కేసీఆర్ అవినీతిపరుడు’ అని అమిత్ షా , ‘కేసీఆర్ కు తెలంగాణ ఏటీఎం’ అని బీఎల్ సంతోష్, ‘కేసీఆర్ అవినీతిని బయటపెడుతాం’ అని కిషన్ రెడ్డి , ‘కేసీఆర్ ను జైలుకు పంపుతం' అని బండి సంజయ్ అదే పనిగా విమర్శలు చేశారని.. కానీ ఇంత వరకూ చేసిందేమీ లేదని షర్మిల ఆరోపించారు.
కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో బీజేపీ లీడర్ల మాటలు ఢిల్లీ కోటలు దాటుతాయని.. కానీ చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితమవుతాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కమలం నేతల మాటలు...‘పాడిందే పాటరా.. పాచిపళ్ళ బీజేపీ’ అన్నట్లుందని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా....మాటలు చెప్పే బీజేపీ చర్యలు మాత్రం తీసుకోదన్నారు. నువ్వు కొట్టినట్లు చెయ్...నేను ఏడ్చినట్లు చేస్తా... అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య యవ్వారం ఉందని షర్మిల విమర్శించారు.
కాళేశ్వరంలో అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్న షర్మిల
కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి కనిపిస్తున్నా.. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దోచుకున్నా...కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి లేదని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై సీబీఐ విచారణ అడిగిన బీజేపీ.. కేసీఆర్ అవినీతిపై ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరదని షర్మిల ప్రశఅనించారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీ లీడర్లకు హస్తం ఉందని సీబీఐ దర్యాప్తు కోరడం లేదా అని ప్రశ్నించారు.
గతంలో కాళేశ్వరం అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసిన షర్మిల
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల గతంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరక్టర్ ను కలిసి కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలు అందించామని ప్రకటించారు. తర్వాత ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలనూ కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఇంకా ఎలాంటి విచారణ జరగడం లేదు. కాళేశ్వరం కాంట్రాక్టర్ అయిన మైహోం సంస్థపై షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేస్తూంటారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సీబీఐ చేతికి వెళ్లడంతో ఇప్పుడు టీఆర్ఎస్ అవినీతిపైనా దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.