Sharmila To Delhi :  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసేందుకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వాటిపై ఆధారాలు బీజేపీ పెద్దలకు ఇస్తారని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పాదయాత్ర నిలిపివేసి మరీ రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే చాలా రోజులుగా కాళేశ్వరం అవినీతిపై చర్చ జరుగుతోంది. బీజేపీ దగ్గర కావాల్సినంత సమాచారం ఉంటుంది. కొత్తగా షర్మిల ఇచ్చే ఆధారాలు ఏముంటాయని.. ఖచ్చితంగా రాజకీయ పరమైన అంశాలపై చర్చించేందుకే వెళ్తున్నారన్న  అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.


హఠాత్తుగా  బీజేపీతో చర్చలకు ఢిల్లీకి షర్మిల


వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తెలంగాణలో రాజకీయ అదృష్యాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల సుదీర్ఘమైన పాదయాత్రను చేస్తున్నారు. రెండు వేల కిలోమీటర్లను దాటి నడుస్తూనే ఉన్నారు. గ్రేటర్ మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాలన్నింటినీ కవర్ చేస్తున్నారు. మొదట్లో ఆమె పాదయాత్రను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇటీవల ఆమె ఘాటు వ్యాఖ్యలు చేస్తూండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆందోల్ నియోజకవర్గ పాదయాత్రలో ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ నేతలు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. 


చర్చల కోసం బీజేపీ పెద్దలే పిలిచారా ?


ఇటీవలే తన తండ్రిని కుట్రచేసి చంపారని తనను కూడా చంపే అవకాశాలుఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య బీజేపీ నేతలతో చర్చల కోసం ఢిల్లీ వెళ్లనుండటం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ఏ స్థాయి నేతలతో సమావేశం అవుతారన్నదానపై స్పష్టత లేదు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో బీజేపీ లేదు. ఒంటరి పోటీకే సిద్ధమవుతున్నారు.  అయితే ఏపీ రాజకీయాల అంశంపై ఆమెతో చర్చించడానికి బీజేపీ అగ్రనేతలు పిలిపించి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 


ఏపీ రాజకీయాలపైనా చర్చిస్తారా ?


సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు విభేధాలున్నాయి. ఈ విషయం చాలా సార్లు స్పష్టమయింది. షర్మిల తెలంగాణలో కన్నా ఏపీలో రాజకీయం చేస్తే ఎక్కువ ప్రభావం  చూపగలరన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో ఉందని చెబుతున్నారు. తెలంగాణలో ఆమెను ప్రజలు ఓన్ చేసుకోవడం కష్టం కాబట్టి.. ఏపీలో రాజకీయాలు చేస్తే తమ వంతు మద్దతిస్తామని ప్రతిపాదన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా పలుమార్లు బీసీ సంఘాలతో సమావేశమై.. బీసీని సీఎంను చేసుకుందామని వారికి భరోసా ఇచ్చారు. అయితే తర్వాత సైలెంటయ్యారు. జగన్, షర్మిల తల్లి విజయలక్ష్మి  పలుమార్లు ఏపీలో  జగన్, తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేస్తారని ప్రకటించారు. అది కుటంబపరమైన నిర్ణయం అని ఆమె ఏపీ రాజకీయాల్లోకి రారని మరికొంత మంది వాదిస్తున్నారు. 


మునుగోడు బరిలో టీఆర్ఎస్సా - బీఆర్ఎస్సా ? నిబంధనలేం చెబుతున్నాయి ?