BRS leader Harish Rao in London: అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై పోరాడిన హరీష్ రావు... ఆదివారం అర్థరాత్రి వరకూ బిజీగా ఉన్నారు. అయితే  సోమవారం సాయంత్రానికి లండన్ లో ప్రత్యక్షమయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, సీబీఐకి.. కాళేశ్వరం అంశంపై చర్యలు తీసుకునే అధికారాన్ని అసెంబ్లీ ఇవ్వడం వంటివి చర్చించేందుకు ఫామ్ హౌస్‌కు నేతలు ఉదయమే వెళ్లారు. అలా వెళ్లిన నేతల్లో హరీష్ రావు లేరు. అయితే ఆయన అర్థరాత్రి వరకూ అసెంబ్లీలో ఉన్నందున కాస్త ఆలస్యంగా ఫామ్ హౌస్ కు వస్తారేమో అనుకున్నరు. కానీ ఆయన సాయంత్రానికి లండన్ లో ఉన్నట్లుగా స్పష్టమయింది.  

లండన్ ఎయిర్ పోర్టులో కొంత మంది ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికిన ఫోటోలు వైరల్ అయ్యాయి.  కుమార్తె ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేర్పించేందుకు హరీష్ రావు లండన్ వెళ్లినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మామూలుగా అయితే హరీష్ రావు లండన్ ప్రయాణం అంత వైరల్ అయ్యేది కాదు. కానీ ఆయనపై కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారు. కాళేశ్వరం స్కామ్ లో జరిగిన అవినీతికి హరీష్ రావే బాధ్యుడని ఆరోపించారు. ఆయనతో పాటు సంతోష్ రావు కూడా అవినీతికి పాల్పడి కేసీఆర్ కు మరకలు అంటిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్ రావు స్పందన కోసం చాలా మంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

హరీష్ రావు విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్పందన  పాజిటివ్ గా ఉంది. ఆయన కాళేశ్వరంపై ప్రభుత్వ తీరును ఎండగట్టారని ట్వీట్లు చేస్తోంది. కవిత చేసిన ఆరోపణల్ని పట్టించుకోవడం లేదన్న సంకేతాలను పార్టీ వర్గాలు..  పై స్థాయి నాయకులు ఇస్తున్నారు. గతంలో హరీష్ రావుపై ఇతర పార్టీల నేతలు ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారు..కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఎప్పుడూ చేయలేదు. అందుకే ఈ సారి కవిత ఆరోపణలు సంచలనంగా మారాయి. హరీష్ రావు కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. తర్వాత మాత్రం ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు. [ 

హరీష్ రావును పార్టీలో కొంత కాలం దూరం పెట్టడం.. మరికొంత కాలం ప్రాధాన్యత ఇవ్వడం వంటివి జరుగుతూంటాయి. అయితే హరీష్ రావు ఎప్పుడూ పార్టీ నాయకత్వం పై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. చిన్న మాట కూడా నెగెటివ్ గా మాట్లాడలేదు. ఇప్పుడు కవిత రూపంలోనే ఆయనపై పెద్ద ఆరోపణలు వచ్చాయి. నేరుగా రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు రావడం చిన్న విషయం. లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా హరీష్ రావు స్పందించే అవకాశం లేదని.. పార్టీ స్పందన తన స్పందన అని ఆయన అనే అవకాశాలు ఉన్నాయి.