Telangana News :   బెల్లంపల్లి  బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ సోమవారం సీబీఐకి ఫిర్యాదు చేశారు. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ న్యూఢిల్లీలోనే ఉంటున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేయడంతో.. వెంటనే ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుండి  డిశ్చార్జ్ అయిన తర్వాత  ఎమ్మెల్యే చిన్నయ్యపై సీబీఐకి కూడా శేజల్ ఫిర్యాదు చేశారు.  


పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే మ్యానేజ్ చేస్తున్నారని శేజల్ ఆరోపిస్తున్నారు.  అందుకు సంబందించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేకే సీబీఐని ఆశ్రయించినట్లు చెప్పారు. పారదర్శకంగా దర్యాప్తు చేయాలనీ సీబీఐని కోరామన్నారు.  తనపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని శేజల్ కన్నీరు పెట్టుకున్నారు. తన దగ్గర ఉన్న ఆడియో టేప్స్, ఇతర ఆధారాలను సీబీఐకి అందజేశానని... సీబీఐ దర్యాప్తు చేస్తామని చెప్పిందని ఢిల్లీలో మీడియాకు తెలిపారు.  రైతులను మోసం చేస్తే ఢిల్లీకి ఎందుకు వస్తామని ఆమె ప్రశ్నించారు.                                       


తాము రైతులని మోసం చేశామని ప్రచారం చేస్తున్నారని..  మోసపోయిన రైతులు ఉంటే రావాలని కోరుతున్నా ఎవరు రావడం లేదన్నారు.  ఇన్వెస్ట్‌మెంట్ చేసివాళ్లకు షేర్లు ఇచ్చాము, ఎమ్మెల్యే సపోర్ట్ ఇస్తామని చెప్పినందుకే ఆయనకు షేర్ ఇచ్చామని  తెలిపారు.  దుర్గం చిన్నయ్యపై కేసు నమోదై విచారణ జరిపేంత వరకు ఢిల్లీలోనే ఉంటామని స్పష్టం చేశారు.  బెల్లంపల్లి లోకల్ పోలీసులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెప్పినట్టు అనుసరిస్తున్నారని ఆరోపించారు.  ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. తెలంగాణ పోలీసులు సంప్రదిస్తే అన్ని అంశాలు వివరిస్తానని తెలిపారు.   సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. వారైనా తమకు న్యాయం చేాయలన్నారు.  


దుర్గం చిన్నయ్య అనుచరులు పదే పదే వేధిస్తున్నారంటూ   ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద శేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి శేజల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఆపై ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఎన్‌సీడబ్ల్యూతో పాటు అనేక కమిషన్లను కలిసి తన బాధను వెల్లడించారు. నిన్న బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయం ఎదుట కూడా శేజల్ ధర్నా చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు రక్షణ కలిపించాలని, తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించి, పార్టీ నుంచి తొలగించి కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ దుర్గం చిన్నయ్య ఖండిస్తున్నారు.