Sedition case on Professor Haragopal: పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయింది. ఉపా చట్టం (Unlawful Activities (Prevention) Act) 2022 కింద గత ఏడాది ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. ఇదే కాక ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు.
ఈ విషయం ఎలా బయటపడిందంటే..
పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండు నెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అతడిపై మరిన్ని కేసులు ఉన్నాయని, బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలియజేశారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు ముందు పెట్టారు. దీంతో ఈ విషయం బయటపడింది.
అభియోగాలు ఇవీ
ప్రొఫెసర్ హరగోపాల్ మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇంకా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్ (జస్టిస్ సురేశ్ ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరుల పేర్లు ఉన్నాయి.
ప్రొఫెసర్ స్పందన ఇదీ
రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టవద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని, కాబట్టి ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మావోయిస్టులకు తమ మద్దతు ఎందుకు ఉంటుందని, వాళ్లు తమ లాంటి వాళ్ల మీద ఆధారపడరని అన్నారు. అసలు వాళ్ల ఉద్యమం వేరు అని అన్నారు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం అని అన్నారు. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారని చెప్పారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారని వాపోయారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల తరుణంలో ఇలాంటి కేసులు దురదృష్టకరమని, పేర్లు రాసుకుపోతే సరికాదని, సరైన ఆధారాలు ఉండాలని చెప్పారు.
కేసులు ఎత్తేయాలని డిమాండ్
ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం. రాఘవాచారి డిమాండ్ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.