ABP  WhatsApp

KCR Speech: బీఆర్ఎస్ సర్కార్ తీసుకురండి, అదంతా నేను చేసి చూపిస్తా, ఎవరు ఆపుతారో చూస్తా - కేసీఆర్

ABP Desam Updated at: 15 Jun 2023 06:16 PM (IST)

సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్ పూర్‌లో పర్యటించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును గురువారం (జూన్ 15) ప్రారంభించారు.

నాగ్ పూర్ లో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

NEXT PREV

ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి రెండు లేదా మూడు దశాబ్దాలు పడుతుందని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా మన దేశం ఎన్నో ప్రాథమిక విషయాల్లో ఎందుకు వెనకబడి ఉందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్ పూర్‌లో పర్యటించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును గురువారం (జూన్ 15) ప్రారంభించారు. ఆ తర్వాత ఓ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. 


ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం అయిపోయింది


ల‌క్ష్యం లేని దేశం ఎక్కడ‌కు వెళ్తొందని కేసీఆర్ ప్రశ్నించారు. జ‌నాభా విష‌యంలో మ‌నం చైనాను కూడా దాటేశామని, దేశంలో ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ల‌క్ష్యంగా మారిందని అన్నారు. ఈ ఎన్నిక‌ల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయిందని, అందులో గెలవడమే ముఖ్యం అయిపోయిందని అన్నారు. ప్ర‌తి ఎన్నిక‌లోనూ నేత‌లు కాదు.. జ‌నాలు గెల‌వాలని పిలుపు ఇచ్చారు.


‘‘మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్‌లో 8 రోజుల‌కు ఒక‌సారి తాగునీరు వ‌స్తుంది. సోలాపూర్‌లో 11 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. మనకి దగ్గర్లోనే క్రిష్ణా, గోదావరి సహా ఎన్నో నదులు పారుతున్నాయి. ఢిల్లీ నగరం కూడా గంగా, యమున నదుల మధ్యలో డెల్టాలో ఉంది. అయినా ఢిల్లీలో నీళ్ల సమస్య ఉంది. ఇందుకు కారణం ఏమై ఉంటుంది. ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యం అయిపోయింది. కర్ణాటకలో ప్రభుత్వం మారింది. ఏమైనా మార్పు జరుగుతూ ఉందా? ఇక్కడ మహారాష్ట్రలో ప్రతి పార్టీ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరూ మార్పు ఎందుకు తేవట్లేదు. బీఆర్ఎస్ కు ఒక మిషన్ ఉంది. భారత్ లో ఎందుకు తెలంగాణ తరహా మార్పులు జరగడం లేదు? 


ఏ దేశంలో అయినా మార్పు జరగడానికి సమస్యలు తీరిపోవడానికి 2 లేదా 3 దశాబ్దాలు పడుతుంది. కానీ మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. ఎందుకు ఇంకా పరిస్థితి అంతే ఉంది? లక్ష్యం లేని సమాజం, దేశం ఎటు పోతాయి’’ అని కేసీఆర్ మాట్లాడారు.


ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి



మీ డిప్యూటీ సీఎం ఫడణవీస్. ఆయన నా ఫ్రెండ్. గతంలో నాందేడ్ సమావేశానికి వచ్చినప్పుడు కేసీఆర్ భాయ్.. మా రాష్ట్రంలో నీకేం పని. మీ తెలంగాణను చూసుకో అన్నారు. నేను దేశ పౌరుడ్ని, దేశంలో ఎక్కడికైనా వెళ్తానని చెప్పాను. మన దేశంలో ఎంతో మంది రైతులు, సాగుభూమి, నీరు ఉంది. అందుకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. మన ఆహారం ప్రపంచానికి ఎగుమతి కావాలి. దీనిపై కొంత మంది కథలు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురండి.. నేను చేసి చూపిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా. మన ఆహార ధాన్యాలు ప్రతి రాష్ట్రానికి, ప్రపంచానికి చేరాల్సిన అవసరం ఉంది. ఈ విధానం అమలైతే ఎన్నో ఉద్యోగాలు కూడా వస్తాయి.-


పుష్కలంగా బొగ్గు నిల్వలు


‘‘ప్ర‌పంచంలో భార‌త్‌లోనే ఎక్కువ శాతం వ్యవసాయం యోగ్యమైన భూమి ఉంది. మ‌నం త‌లుచుకుంటే దేశంలోని ప్రతి ఎక‌రాకు సాగునీరు ఇవ్వొచ్చు. దేశంలో జ‌ల విధానం స‌మూలంగా మారితేనే మార్పు సాధ్యం అవుతుంది. విద్యుత్ విష‌యంలోనూ ఎన్నో స‌మ‌స్యలు ఉన్నాయి. దేశంలో బొగ్గుకు కొర‌త లేదు, అయినా విద్యుత్ స‌మ‌స్య ఉంది. దేశంలోని బొగ్గుతో 150 ఏళ్లు విద్యుత్ ఇవ్వొచ్చని కోల్ ఇండియానే చెబుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణ‌లో మేం సాగుకు 24 గంట‌ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు లేవని చెప్పను గానీ, గ‌ణ‌నీయంగా త‌గ్గించగలిగాం’’ అని కేసీఆర్ తెలిపారు.

Published at: 15 Jun 2023 06:06 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.