South Central Railway : సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక విజయాలు సాధించిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలను తెలియచేయడం కోసం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జీఎం అరుణ్ కుమార్ జైన్ రైల్వే అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..  దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.13051.10 కోట్ల  ఆదాయం సమకూర్చుకుందని తెలిపారు.  గత ఏడాది ప్రయాణికుల నుంచి రూ.2974.62 కోట్ల ఆదాయాన్ని పొందగా.. ఈ ఏడాది రూ.5140.70 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. అంతే కాకుండా టికెట్ తనిఖీల ద్వారా 211.26 కోట్ల  ఆదాయాన్ని నమోదు చేసిందని, దక్షిణ మధ్య రైల్వే ప్రారంభమైనప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలను సాధించదని తెలియజేశారు. ఆదాయంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా దక్షిణ మధ్య రైల్వే అద్భుత ప్రతిభను కనబరచిందన్నారు. ఇదంతా రైల్వేలోని అధికారులు, సిబ్బంది, కార్మికుల సమిష్టి కృషి, అంకితభావంతో అందించిన సేవల ఫలితమేనని అన్నారు.


ప్యాసింజర్ల నుంచి రూ.5140 కోట్ల ఆదాయం 


దక్షిణ మధ్య రైల్వేకు ఫ్రైట్ ద్వారా రూ.13,051 కోట్లు, ప్యాసింజర్ల ద్వారా ఈ ఏడాది ఆదాయం రూ.5,140 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. గతేడాది మొత్తం ఆదాయం రూ.14,266 కోట్లు వస్తే.. ఈ ఏడాది ఆదాయం రూ.18,973 కోట్లకు పెరిగిందన్నారు. ఈ ఏడాది 49.8 కిలో మీటర్ల నూతన రైల్వే లైన్లు, 151 కిలోమీటర్లు డబ్లింగ్, 182 కిలోమీటర్ల థ్రిప్లింగ్ లైన్లు పూర్తి చేశామని అరుణ్ కుమార్ వెల్లడించారు. 1017 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేశామన్నారు. ఎలక్ట్రిఫికేషన్ వల్ల గంటకు 130 కిలోమీటర్ల వేగం అందుకున్నామని వివరించారు. ఖాజీపేట-సికింద్రాబాద్ మార్గంలో 130 కిలోమీటర్ల స్పీడ్ తో రైలు నడిపించామన్నారు. టికెట్ తనిఖీల ద్వారా ఈ ఏడాది రూ.211.26 కోట్లు, స్క్రాప్ అమ్మకం ద్వారా రూ.391 కోట్లు ఆదాయం వచ్చిందని జీఎం ప్రకటించారు. 


ఆగస్టు, సెప్టెంబర్ నాటికి సిద్ధిపేటకు రైలు 


2024 జనవరిలోపు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అందుబాటులోకి తెస్తామని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు వ్యయం రూ.1169 కోట్లని, అందులో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ.779కోట్లు, కేంద్రం వాటా రూ.390 కోట్లు అని వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కేవలం రూ.379 కోట్లు చెల్లించిందన్నారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కాకుండా మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేసిందని జీఎం తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం రూ.600 కోట్లు కేటాయించిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి సిద్ధిపేటకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2021-22లో 127 మిలియన్ ప్యాసింజర్లు ప్రయాణిస్తే ఈ ఏడాది  255 మిలియన్లకు చేరిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.