YS Viveka Case News :  వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. మంగళవారం ఉదయం పదిన్నరకు తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ పూర్తయిన తర్వాతనే తాను విచారణకు వెళ్తానని అవినాష్ రెడ్డి ముందుగానే ప్రకటించారు. సా. 5 గంటల వరకు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవొద్దని  హైకోర్టు సూచించింది  సాయంత్రం ఐదు గంటల తర్వాత విచారణకు వెళ్తారని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ మంగళవారం రావాలని నోటీసులు జారీ చేసింది.  


వైఎస్ వివేకాకు అనేక వివాహేత బంధాలు ఉన్నాయన్న అవినాష్ రెడ్డి 


అవినాష్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో వైఎస్ వివేకాపై సంచలన ఆరోపణలు చేశారు.   వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే కారణమంటూ ఆయన ముందస్తు బెయిల్  పిటిషన్ లో పేర్కొన్నారు.  అయితే A 2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో కూడా వివేకాకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపించారు. ఈకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.   తనకు గతంలో 161CRPC కింద సీబీఐ అధికారులు తనని విచారించారని ఇప్పుడు 160కింద నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. తనపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి  అధారాలు లేవని పిటిషన్‌లో తెలిపారు.                    


వైఎస్ అవినాష్ ను గతంలో నాలుగు సార్లు ప్రశ్నించిన సీబీఐ 


 గతంలోనాలుగుసార్లు అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ విచారించింది. జనవరి 28 , ఫిబ్రవరి 24, మార్చ్ 10, మార్చ్ 14 తేదీల్లో అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఏప్రిల్ 17న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. కానీ బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకూ రానని అవినాష్ మొండికేశారు. హైకోర్టులో వాదనలు పూర్తి కాలేదు.   దీంతో మంగళవారం విచారణకు రావాలని సీబీఐ కొత్తగా నోటీసులు జారీ చేసింది.       


భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి                                          


మరో వైపు  వివేకా హత్య కేసులో  సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసిన నిందితుల కస్టడీపై ముగిసిన వాదనలు ముగిశాయి. A6 ఉదయ్ కుమార్, A7 వైయస్ భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరారు. నిందితులు వైఎస్ వివేకా హత్యలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని..అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ తరపు న్యాయవాది వెల్లడించారు. కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.