Secunderabad Protest : అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి రైళ్లను తగలబెట్టాయి. స్టేషన్ లోని స్టాళ్లను ధ్వంసం చేశారు. రైల్వే ట్రాక్ లకు అడ్డంగా పార్సిల్ వేసి అగ్గిరాజేశారు. ప్రసుత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. నిరసనకారులు రైల్వే ట్రాకులపై బైఠాయించారు. నిరసనకారులను చర్చించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయినా ఆందోళనకారుల ఆగ్రహంతో పోలీసులపై రాళ్లు విసిరారు. నిరసనకారులను అదుపుచేసేందుకు ఓ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. 



వాట్సాప్ గ్రూపులు 


అగ్నిపథ్‌ పై సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు సమాచారం. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, ఆందోళనకు సంబంధించిన సందేశాన్ని ముందుగానే గ్రూపుల్లో పంపినట్లు సమాచారం. అయితే పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ నిరసనకు ఆందోళకారులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువకులు గురువారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా అభ్యర్థులు వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు గురువారం రాత్రే చేరుకున్నారు. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌ బయట యువకులు కాసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఓ బస్సు అద్దాలను పగులగొట్టినట్లు తెలుస్తోంది.  


రైళ్లకు నిప్పు 


నిరసనకారులు ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ లోకి దూసుకెళ్లి పట్టాలపై బైఠాయించారు. ఆ తర్వాత ప్లాట్‌ఫాంపై స్టాళ్లు ధ్వంసం, స్టేషన్‌లో నిలిపిన రైళ్ల కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే పార్సిల్‌ విభాగం వద్ద ఉన్న బైక్ , ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టాలపై వేసి తగులబెట్టారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిరసనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను మోహరించారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం, టీయర్ గ్యాస్‌ ప్రయోగించినా ఆందోళన సద్దుమణగలేదు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులు స్టేషన్ ఖాళీ చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.