Secunderabad Protest : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ వివరాలు తెలిపారు. శుక్రవారం(17 వ తేదీ) ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి 300 మంది చొరబొడ్డారని వెల్లడించారు. ఈస్ట్ కోస్ట్, దనపుర్ ఎక్స్ ప్రెస్ లో మరికొంత మంది వచ్చారన్నారు. మొత్తం 30 ట్రైన్ కోచ్ లు డేమెజ్ అయ్యాయని తెలిపారు. ఒక కోచ్ ను పెట్రోల్ పోసి కాల్చేశారని పేర్కొన్నారు. అగ్నిపథ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్ లో యువకులు ప్రవేశించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ 46 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ విధంగా ఎవరైనా చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. వాళ్లకు జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉందన్నారు. వీళ్లంతా 2 వేల మంది ఆర్మీ రిక్రూట్మెంట్ ఆస్పిరెంట్స్, వీళ్లకి మూడు సార్లు ఆర్మీ పరీక్ష రద్దైంది. వీరు చదువుకున్న కోచింగ్ సెంటర్లు తప్పుడు దారిలో వెళ్లేందుకు రెచ్చగొట్టారని ఎస్పీ అనురాధ పేర్కొన్నారు. 


వాట్సప్ గ్రూప్స్ ద్వారా ప్లాన్  


రైల్వే స్టేషన్ బ్లాక్ గ్రూప్, హకీంపేట్ ఆర్మీ గ్రూప్, సోల్జర్స్ డై గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆందోళనలు ప్లాన్ చేసుకున్నారని ఎస్పీ అనురాధ తెలిపారు. ఇప్పటి వరకూ వచ్చిన వాళ్లు అందరూ తెలంగాణ వాళ్లే ఉన్నారన్నారు. అభ్యర్థులపై ఫైరింగ్ పై స్పందించిన ఎస్పీ... లోకో ఇంజిన్ లో 4 వేల లీటర్ల ఆయిల్ ఉందని, దానికి నిప్పుపెడితే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఫైర్ చేశామన్నారు. ఒక బులెట్, మిగిలినవి 20 రౌండ్స్ పిల్లేట్స్ అని పేర్కొన్నారు. ఆర్పీఎఫ్ వాళ్లు ఫైర్ చేశారన్నారు. ఈ ఘటనలో మొత్తం 58 కోచ్ లు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. అల్లర్ల వల్ల రూ. 12 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసిందన్నారు.  ఒకసారి కేసు నమోదు చేస్తే రైల్వే యాక్ట్ ప్రకారం ఇక ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చన్నారు. తమ దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని, వాటిని పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఘటనలో 9 మంది రైల్వే స్టాఫ్ గాయపడ్డారని ఎస్పీ అనురాధ తెలిపారు. హైదరాబాద్ పోలీసులకు కేసు ట్రాన్ ఫర్ చేశామన్నారు. 


తిరుపతి రైల్వేస్టేషన్ టార్గెట్


తిరుపతి రైల్వే స్టేషన్ టార్గెట్ చేయాలని పోస్టులు పెట్టిన ఇద్దరు ఆర్మీ అభ్యర్థులను తిరుపతి జిల్లా, యర్రావారిపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్నిపథ్ పథకానికి నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇందులో భాగంగానే విధ్వంసం రోజు 17వ తేదీకి ముందుగానే కొంతమంది రైల్వే స్టేషన్ బ్లాక్, ఆర్మీ 17/6 అనే రెండు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూపులలో విధ్వంస రచన ఎలా చేయాలో దిశానిర్దేశం చేసుకున్నట్లు నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఇందులో భాగంగా యర్రావారిపాళెం మండలంలోని పెద్దనాయినివారిపల్లికి చెందిన రాజేష్, రూపేష్ అనే యువకులు ఆయా గ్రూపుల్లో సభ్యులుగా ఉండడంతో పాటు తిరుపతి రైల్వే స్టేషన్ ను లక్ష్యంగా చేసుకోవాలని పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే సైబర్ నిఘా వర్గాలు వీరి కదలికలను కనుగొన్నాయి.  పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక పోలీసులు శనివారం రాత్రి వీరిద్దరిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.