Secunderabad Fire Accident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న హోంమంత్రి మహమూద్ అలీ ఘటనాస్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని హోంమంత్రి తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల కారణంగా మంటల ఉద్ధృతి ఎక్కువగా ఉందన్నారు. 80 శాతం మంటలు అదుపుచేశారని తెలిపారు. మరో గంటలో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్నారు. అయితే అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదని తెలిపారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మంటలు అదుపులోకి వచ్చాక ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్ని ప్రమాదంలో కాలనీ వాసులు నష్టపోతే వారిని ఆదుకుంటామన్నారు. బిల్డింగ్ యజమానిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
"సికింద్రాబాద్ ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఐదు డిపార్ట్మెంట్ ల తోటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ చేసే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని కిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మొదటి అంతస్తులో ముందుగా మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ రెస్క్యూ చేశాం. ఈ ప్రమాదంలో భవనం మొత్తం కూడా డామేజ్ అయింది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత DRF సిబ్బంది కూల్చివేతలపై నిర్ణయం తీసుకుంటారు. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదంలో ఎవరిది తప్పుంటే విచారణ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. "- నాగి రెడ్డి , అడిషనల్ డీజీ, ఫైర్ డిపార్ట్మెంట్
భవనం కూలిపోయే ప్రమాదం
ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన మంటలు కాసేపటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. పక్కన ఉన్న రెసిడెన్సియల్ భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందన్న టైంలో అధికారులు తీవ్రంగా శ్రమించి ప్రమాద తీవ్రతను చాలా వరకు తగ్గించారు. భవనానికి మూడు వైపుల మంటలు వ్యాపించాయి. పొగ విపరీతంగా వస్తోంది. దీని వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందో అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పొగ, మంటలు కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రజల్లో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా స్థానికంగా ఉండే ప్రజలను ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేశారు. నెట్ సేవలను బంద్ చేశారు. ఆ ప్రాంతమొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటనా స్థలంలోనే అంబులెన్స్ సర్వీసులు ఉంచారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మంటల ధాటికి భవనం చాలా వరకు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గోడలకు పగుళ్లు ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ భవనం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని అంచా వేస్తున్నారు. అందుకే అటువైపు ఎవరూ వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టారు.