Secunderabad Fire Accident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట డెక్కన్ నిట్వేర్ స్పోర్ట్స్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షోరూమ్ లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనాస్థలి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దుకాణంలో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలను అదుపు చేసే ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రధాన రహదారి వైపు వాహనాలను దారి మళ్లించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించాయి. పక్కనున్న ఇళ్లను అధికారులు ఖాళీచేయిస్తున్నారు. అంతకంతకూ మంటలు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మాల్ కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


నలుగురిని రక్షించాం- మంత్రి తలసాని 


రామ్ గోపాల్ పేట్ అగ్నిప్రమాద స్థలిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను మంత్రి పర్యవేక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అగ్నిప్రమాద ఘటనలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. షోరూమ్ లో చిక్కుకున్న నలుగురిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడారన్నారు. షోరూమ్ లో మరో ఇద్దరు చిక్కుకుని ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మూడు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారని చెప్పారు. మరో రెండు గంటల్లో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయని మంత్రి తలసాని తెలిపారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇళ్ల మధ్య గోదాంలు, పరిశ్రమలు ఉండటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి వాటివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తోందన్నారు. హైదరాబాద్‌లో కొందరు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం చర్యలు చేపడితే 25 వేల దుకాణాలు ఖాళీ చేయించాల్సి ఉంటుందని మంత్రి తలసాని తెలిపారు. అనుమతులు లేని పరిశ్రమలు, గోదాంలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.  



భారీ శబ్దాలతో ఎగిసిపడుతున్న మంటలు


 రామ్ గోపాల్ పేట్ డెక్కన్ షోరూమ్ లో చెలరేగిన మంటలు అదుపులోకి రావడంలేదు. దాదాపు నాలుగు గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుంది. చుట్టుపక్కల మరో 2 భవనాలకు మంటలు వ్యాపించాయి. స్థానికంగా, చుట్టపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనంలో ఇద్దరు చిక్కుకుని ఉండొచ్చని ఫైర్ సిబ్బంది తెలిపారు. మంటలు, తీవ్రమైన పొగ వల్ల సహాయచర్యలకు ఇబ్బంది కలుగుతోంది. తీవ్రమైన పొగ వల్ల ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానికంగా ఆస్పత్రికి తరలించారు.  భారీ శబ్దాలకు మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల బిల్డింగ్ లోని వారిని తరలిస్తున్నారు.