Puvvada Ajay :    బీ ఆర్ ఎస్ మొదటి సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  సభను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం చరిత్ర లో ఇంతటి సభ ఎపుడూ జరగలేదని.. మాకు సంక్రాంతి 18 న జరిగింది అనిపించిందని పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు.  ఈ సభ ద్వారా సీఎం కేసీఆర్, మిగతా నేతలు దేశానికి దిశా నిర్దేశం చేశారన్నారు.  ఈ సభ ను కేవలం పది రోజుల వ్యవధి లో విజయవంతం చేశామన్నారు.  ఖమ్మం జిల్లాకు నిధుల వరద పారించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు  చెప్పుకుంటున్నామని తెలిపారు.  ఖమ్మం అభివృద్ధికి గుమ్మం లా మారిందన్నారు. 


 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే కరెంట్ తీగను బండి సంజయ్ పట్టుకోవాలి : పువ్వాడ అజయ్ 


కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నారని రేవంత్ చేసిన విమర్శలకు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్ ఇచ్చారు.  కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీ లు అవసరం లేదు.. వాళ్ళ నేతలే చాలన్నారు.  సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకం లో కళ్ళ పరీక్ష చేసుకుంటే మంచిది.. లేదంటే మేమే ఓ టీం ను పంపిస్తామని సలహా ఇచ్చారు.  బండి సంజయ్ కు 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకోవాలని సెటైర్ వేశారు.  


ఖమ్మ సభ తో దేశ రాజకీయాలు మారిపోతాయి : పల్లా రాజేశ్వర్ రెడ్డి 


ఖమ్మ సభ తో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయని..  రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు  కరీంనగర్ సభ 2001 లో తెలంగాణ ఏర్పాటు కు బాటలు వేసినట్టే ఖమ్మం సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు  ప్రగతి శీల శక్తుల కలయిక కు ఖమ్మం సభ బాటలు వేసిందని.. ఎవరేమనుకున్నా ఖమ్మం సభ చాలా పద్దతిగా జరిగిందన్నారు.  దేశ సంపదను ఇద్దరు గుజారాతి లు మరో గుజారాతీ కి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ ఆటలు చెల్లవు గాక  చెల్లవు అని ఖమ్మం సభ సందేశం ఇచ్చిందన్నారు.  విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది దీన్ని కూడా ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తామని ప్రకటించారు.  ఖమ్మం సభ ఆరంభం మాత్రమేనన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో బీ ఆర్ ఎస్ కచ్చితమైన మార్పు దిశగా అడుగులు వేస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.  2014 లో ధనవంతుల జాబితాలో ఆదానీ ది 604 ర్యాంకు.. ఇపుడు మొదటి స్థానానికి ఎలా ఎగబాకారు.. బీజేపీ నేతలు చెప్పాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఆధారాలు లేకుండా అవినీతి పై ఆరోపణలు చేసే వారి గురించి మాట్లాడలేమని.. బండి సంజయ్ కు వ్యవసాయం గురించి కరెంటు గురించి ఏం తెలుసని పల్లా ప్రశ్నించారు.  


ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదు :  ఎంపీ రవిచంద్ర 
 
 సభ లో ఎంత మంది జనాలు ఉన్నారో బయట అంతమంది జనాలు ఉన్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.  బీ ఆర్ ఎస్ ప్రబలమైన శక్తిగా మారడానికి ఖమ్మం సభ బాటలు వేయబోతోందని ప్రకటించారు.  ఖమ్మం సభ తో బీజేపీ కి జిల్లాలో స్థానం లేదని తేలిపోయిందని.. బీజేపీ కి ఖమ్మం లో డిపాజిట్లు కూడా రావని ఎంపీ స్పష్టం చేశారు. ఖమ్మం లో బీ ఆర్ ఎస్ పదికి పది స్థానాలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు.