అమృత్‌సర్‌లో షాకింగ్ కేసు వెలుగుచూసింది. శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం  ప్రయాణికులు పూర్తిగా ఎక్కకుండానే టేకాఫ్ అయింది. 30 మంది ప్రయాణికులు ఎక్కకుండా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ విచారణకు ఆదేశించింది. 


సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్ లైన్స్ (సింగపూర్ ఎయిర్ లైన్స్) విమానం నిర్ణీత సమయం కంటే కొన్ని గంటల ముందే బయలుదేరి వెళ్లిపోయింది.  అమృత్ సర్ విమానాశ్రయంలో 30 మందికి పైగా ప్రయాణికులను వదిలివెళ్లి పోయింది. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు డీజీసీఏ గురువారం తెలిపింది.


ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఏమన్నారంటే.


ఈ ఘటనపై అమృత్‌సర్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కూడా స్పందించారు. సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం అమృత్‌సర్ నుంచి రాత్రి 7 గంటల తర్వాత బయలుదేరాల్సి ఉంది. దీన్ని బుధవారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య రీషెడ్యూల్ చేశారు ఈ విషయాన్ని ప్రయాణికులందరికీ ఈమెయిల్స్‌, ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ విమానానికి టికెట్ బుక్ చేసుకున్న గ్రూపులోని 30 మందికి మాత్రం ఈ రీషెడ్యూల్ సమాచారం అందలేదు. దీంతో వాళ్లంతా సింగపూర్‌ ఫ్లైట్ ఎక్కకుండానే విమానాశ్రయంలో ఉండిపోయారు. 


స్కూట్ ఎయిర్ లైన్స్ ఏం చెప్పింది?


విమానం రీషెడ్యూల్ గురించి ప్రయాణికులందరికీ ఈ-మెయిల్ పంపినట్లు స్కూట్ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది సకాలంలో విమానాశ్రయానికి చేరుకుని ప్రయాణించారు అని వివరించారు. 


ఇలాంటి ఘటనే గతంలో కూడా జరిగింది


గతవారం ఢిల్లీకి చెందిన G8-116 ఫ్లైట్‌ బెంగళూరులో ప్రయాణికులను వదిలి పెట్టి టాకాఫ్ అయింది. 55 ప్రయాణికులు విమానాశ్రయంలో ఉండిపోయారు. దీంతో డీజీసీఏ గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ తప్పిదానికి ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 


దీనిపై గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా స్పందించింది. డీజీసీఏ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చింది. దీన్ని పరిశీలించిన తర్వాత కార్‌ సెక్షన్ 3, సిరీస్ C, పార్ట్ IIలోని పేరా 9, 13లో పేర్కొన్న నిబంధన పాటించడంలో గో ఫస్ట్‌ విఫలమైందని ప్రాథమికంగా తేలింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని షెడ్యూల్ XIతోపాటు రూల్ 134లోని పారా (1A), 2019 ATC 02లోని పేరా 5.2లో పేర్కొన్న నిబంధనను పాటించడంలో గో ఫస్ట్ విఫలమైంది. 


ఫ్లైట్ G8-116 బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 6.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. ఈ క్రమంలోనే 55 మంది ప్రయాణికులు బస్సులో వస్తుండగానే టేకాఫ్‌ అయినట్టు గుర్తించారు. తర్వాత వారిని ఉదయం 10 గంటలకు బయలుదేరిన మరొక విమానంలో గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు గో ఫస్ట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఏడాదిలోపు ఈ ప్రయాణికులు ఏదైనా దేశీయ మార్గంలో ప్రయాణిస్తే వాళ్లకు ఉచితంగా ఒక టిక్కెట్‌ను అందించాలని నిర్ణయించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.