సింగూరు ప్రాజెక్టుపై నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ లో నారాయణఖేడ్‌ చేరుకున్న సీఎం.. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుతో సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజ‌క‌వ‌ర్గాల‌ పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. 


నారాయ‌ణ్‌ఖేడ్ బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. బంగారు తెలంగాణలాగే బంగారు భార‌త‌దేశాన్ని త‌యారు చేసుకుందామన్నారు. జాతీయ రాజ‌కీయాల్లో  దిల్లీ దాక కొట్లాడదామన్నారు. దేశాన్ని అమెరికా కన్నా గొప్ప దేశంగా తయారుచేయాలన్నారు. ఇత‌ర దేశాలు వీసాలు తీసుకొని భారత్ కు వ‌చ్చే ప‌రిస్థితి చేసేంత గొప్ప సంప‌ద‌, వ‌నరులు, యువ‌శ‌క్తి దేశంలో ఉన్నాయన్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలంగాణ సంక్షేమ పథకాలపై ఆరా తీశారన్నారు. రైతు బంధు, రైతు బీమాపై వివరాలు అడిగారని సీఎం కేసీఆర్ అన్నారు. సరిహద్దులోని ప్రజలు తమకు ఆ పథకాలు కావాలని అడుగుతున్నారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారన్నారు. మహారాష్ట్రలో కూడా ఈ పథకాలను ప్రారంభిస్తామని చెప్పారన్నారు. అందుకే తెలంగాణ‌లో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయన్నారు. 


సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కావాల్సిన సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డీపీఆర్ ఆధారంగా జిల్లా నీటిపారుదల శాఖ అంచనాలు తయారు చేసింది. దీనికి పరిపాలన అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టు పనులకు కేబినెట్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. కాల్వలు, పంప్ హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూ సేకరణ చేపడుతున్నారు. 


సీఎం కేసీఆర్ వల్లే సంగారెడ్డికి సాగునీరు : మంత్రి హరీశ్ రావు


సంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు గుక్కెడు నీళ్లు కోసం ఎదురుచూసేవాళ్లని, మిష‌న్ భ‌గీర‌థతో ఇప్పుడు ఇంటింటికీ నీళ్లు వ‌స్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. 24 గంట‌ల నాణ్యమైన క‌రెంట్, రోడ్లు వచ్చాయన్నారు. త్వరలో సాగునీరు కూడా రాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ 4000 కోట్ల రూపాయ‌ల‌తో 4 ల‌క్షల ఎక‌రాల‌ను సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మంజీరాలో వ‌ర‌ద వ‌స్తే ఆ నీళ్లు గోదావ‌రిలో కలుస్తాయని, గోదావ‌రి నీళ్లను వెన‌క్కి మ‌ళ్లించి మంజీరాలో క‌లిపే అద్భుత‌ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ క‌ల్పిస్తున్నారన్నారు. ఎక్కడో 90 మీట‌ర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావ‌రి జ‌లాల‌ను మేడిగ‌డ్డ నుంచి మ‌ల్లన్నసాగ‌ర్ కు, మ‌ల్లన్న సాగ‌ర్ నుంచి సింగూర్ కు, సింగూర్ నుంచి జ‌హీరాబాద్, నారాయ‌ణ్‌ఖేడ్‌కు అందిస్తున్నారన్నారు.