Sanampudi Saidireddy is likely Nalgonda BJP MP candidate : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిపోతున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. దీంతో ఆపరరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు కొందరు నేతలు.
ఇటీవల ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిపోయారు. మరికొంత మంది కూడా బీజేపీతో చర్చల్లో ఉన్నారు. కమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బీజేపీ బలహీనంగా ఉంది. అక్కడ కూడా ఓ బీఆర్ఎస్ సీనియర్ నేతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుస నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ మెల్లగా ఖాళీ అవుతోంది. బీజేపీతో పాటు కొంత మంది నేతలు కాంగ్రెస్ లోకి కూడా వెళ్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కుటుంబ సమేతంగా కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి వెళ్తూండటం.. వలసల్ని ఆపేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ గట్టి ప్రయత్నాలు చేయకపోతూండటంతో.. ఎవరికి వారు తమ దారి తాము చూసుకుంటున్నారు.
శానంపూడి సైది రెడ్డి ఎన్నారై. ఆయన బీఆర్ఎస్ మాజీ మంత్రి .. ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ కు వచ్చిన ఉపఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత ఆప్తలయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి మరోసారి పోటీ చేశారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పరాజంయ పాలయ్యారు. ఇప్పుడు బీజేపీలో చేరి.. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు.