RTC employees honesty: రోడ్డు మీద పది రూపాయలు దొరికితే తిరిగి ఇచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది 27 లక్షల రుపాయల విలువైన నగలు దొరికితే ఊరుకుంటారా?. అందరూ ఇలా ఉండాలని లేదు.చాలా కొద్ది మంది మాత్రం ఇతరుల సొమ్మును వారికి చేర్చాలని అనుకుంటారు. అలాంటి వారికి ఎవరి సొమ్ము అయినా దొరికితే.. వారి ఇంటికి చేరిపోతుంది. అలాంటి ఘటనే ఒకటి తెలంగాణ ఆర్టీసీలో జరిగింది. 

గ‌ద్వాల డిపో బ‌స్సు ఈ నెల 5న క‌ర్నూల్ నుంచి గ‌ద్వాల‌కు బ‌య‌లుదేరింది. ఆ బ‌స్సులో ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు. గ‌ద్వాల‌కు బ‌స్సు రాగానే వారు దిగి వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో రూ.27 ల‌క్ష‌ల విలువైన న‌గ‌లు, న‌గ‌దు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను మ‌రిచిపోయారు. బస్సులో ఆ బ్యాగ్‌ను గ‌మ‌నించిన కండ‌క్ట‌ర్, డ్రైవ‌ర్.. దానిని తెరిచి చూశారు. అందులో 25 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, రూ.40 వేల న‌గ‌దు, ఒక ల్యాప్‌టాప్‌ను గుర్తించారు. వెంటనేఆర్టీసీ అధికారుల‌కు స‌మాచారం చేర‌వేశారు. బ్యాగులో ఉన్న వివ‌రాల ఆధారంగా ప్ర‌యాణికులకు స‌మాచారం అందించారు. దీంతో వాటిని సుర‌క్షితంగా బాధితులకు అధికారులు అంద‌జేశారు. 

విధి నిర్వ‌హ‌ణ‌లో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం చాటుకున్నారు. బ‌స్సులో మ‌రిచిపోయిన రూ.27 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాల బ్యాగ్‌ను ప్ర‌యాణికులకు అంద‌జేశారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.27 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికులకి అందజేసిన కండ‌క్ట‌ర్ సూరిబాబు, డ్రైవ‌ర్ పరుశురాములును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు.   ఉదార‌త చాటిన గ‌ద్వాల డిపో కండ‌క్ట‌ర్ సూరిబాబు, డ్రైవ‌ర్ పరుశురాములును టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వారిని స‌న్మానించారు. 

స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తూనే త‌మ‌లో ఉన్న మాన‌వ‌త్వ‌పు ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం దాలుస్తూ స‌మాజంలో ఆర్టీసీపై మ‌రింత న‌మ్మ‌కం పెరిగేలా ఉద్యోగులు చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. 27 లక్షల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. ఆవి పోతే.. ఆ కుటుంబం చాలా ఇబ్బందిపడేది. దొరికిందని.. అనుకోకుండా..  అవి పోగొట్టుకున్న వారి బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ ఉద్యోగులు వాటిని సొంత వారికి చేరేలా చేశారు. ఇలాంటి మంచితనం ఉండబట్టే ఇంకా సమాజంలో మానవత్వం మిగిలి ఉందన్న సంతృప్తి వ్యక్తమవుతూ ఉంటుంది.