Rythu Bheema: రైతు బీమా నమోదు గడువును పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని రైతులకు సూచించింది. రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గడువు నిర్ణయించింది. కానీ తాజాగా ఈ గడువును 13వ తేదీ వరకు పొడిగించింది. రైతులకు ఆసరాగా ఉండేందుకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది తెలంగాణ సర్కారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత బీమా పాలసీలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో రైతు బీమా ఒకటి. ఈ పథకంలో చేరిన రైతులకు వారికి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వం బీమా సదుపాయం ఉన్న రైతులకు ఎలాంటి లోటు లేకుండా ప్రతిసారి బడ్జెట్ ను కేటాయిస్తోంది.  


18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులు అర్హులు.. 
ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు పదమూడవ తేదీ వరకు గడువును కూడా పొడిగించారు. అయితే రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గడువును పొడగించింది. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించడానికి ప్రీమియం చెల్లించింది. గతేడాది (2021 ఆగస్టు 12 నుంచి 2022 ఆగస్టు 13) ప్రీమియం కింద 35.64 లక్షల మంది రైతుల తరఫున రూ. 1,465 కోట్లను భారతీయ జీవిత బీమా సంస్ఖ అయిన ఎల్ఐసీకి చెల్లించింది. 


పాసుబుక్కు జిరాక్సుతో పాటు మరిన్ని... 
గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 22 వరకూ కొత్తగా భూములు కొని పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు తమ భూమి ఉన్న గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కి దరఖాస్తు ఇవ్వాలి. పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం జిరాక్సులను కూడా అందజేయాలి. తద్వారా వారికి 2022 ఆగస్టు 14 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షలు జీవిత బీమా పరిహారం కింద ఎల్ఐసీ అందజేయాలనేది ఈ పథకం నిబంధన. 


అన్నదాతలకు అండగా.. 


రైతు బీమా వల్ల అన్నదాతలు చాలా లాభపడతారని అధికారులు చెబుతున్నారు. ఏ కారణం వల్లనైనా రైతు మృతి చెందినట్లయితే.. ఆ రైతు కుటుంబానికి 5 లక్షల సాయాన్ని అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు తెలంగాణ సర్కార్ అండగా నిలవాలని రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తోంది. రైతు బీమా స్కీమ్ ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తోంది.