Karimnagar News: ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ - గంటల తరబడి ఎదురుచూపులు, కరీంనగర్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

Telangana News: దీపావళి పండుగ తర్వాత స్వస్థలాలకు వెళ్లే వారితో కరీంనగర్ బస్టాండ్ రద్దీగా మారింది. అయితే, రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Continues below advertisement

RTC Buses Full Rush In Karimnagar: దీపావళి పండుగ ముగించుకుని స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతున్న ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజాంబాద్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల  నుంచి వచ్చే ప్రయాణికులంతా కరీంనగర్ (Karimnagar) మీదుగా వెళ్లాల్సిందే. అయితే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పుణ్యమా అంటూ ఆర్టీసీ బస్సుల్లో మునపటి కంటే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో బస్సుల్లో సీట్లు దొరక్క మహిళా ప్రయాణికులు సహా సాధారణ ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఆక్యుపెన్సీతో ఆర్టీసీ సంస్థ లాభాల్లో ఉన్నా సరిపడా సర్వీసులు లేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద బస్టాండ్ కరీంనగర్ బస్టాండ్. దీపావళి తర్వాత స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ బస్టాండ్‌లో ఆదివారం తీవ్ర రద్దీ నెలకొంది.

Continues below advertisement

వసతుల లేమి

కరీంనగర్ నుంచి వరంగల్ (Warangal), హైదరాబాద్ (Hyderabad) ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీపావళి సెలవులు ముగియడంతో తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్‌లో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే, బస్ స్టేషన్‌లో కనీస వసతులు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూర్చోడానికి సరిపడా కుర్చీలు కూడా లేకపోవడం, ఫ్యాన్లు ఉన్నా పని చేయకపోవడం, ఉన్న చోట దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్టీసీ సిబ్బంది దురుసు ప్రవర్తన..

వరంగల్, హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులు గంటల తరబడి ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూస్తుండగా.. ఎప్పుడో ఒక బస్సు వస్తే అందులో కాలు కూడా పెట్టని విధంగా రద్దీ నెలకొంటోంది. ఈ క్రమంలో మరో బస్సు ఎప్పుడు వస్తుందని ఆర్టీసీ సిబ్బందిని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఓ మహిళతో ఆర్టీసీ సిబ్బంది 'ఎప్పుడో అప్పుడు వస్తుంది పో' అని సమాధానం ఇవ్వడంతో తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది సదరు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పరిమితికి మించి...

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో 50 మందికి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కానీ ప్రస్తుతం బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒక్కో బస్సులో 70 నుంచి 80 మంది వరకు ప్రయాణం సాగిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. అటు, మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్ల కోసం ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పండుగ, రద్దీ సమయాల్లో బస్సు సర్వీసులు పెంచాలని కోరుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం దృష్ట్యా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

Also Read: Nagarkurnool News: తెలంగాణలో తీవ్ర విషాదం - గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి

Continues below advertisement