Attack On RTC Driver: బస్సు ఆపలేదని, కారుకు దారి ఇవ్వలేదని ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడులు చేస్తున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ మార్పు రావడం లేదు. డ్రైవర్లపై దాడులు ఆగడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లాలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామం సమీపంలో మంగళవారం టీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఓ వ్యక్తి చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ డిపోకు చెందిన బస్సు TS03UC6568నంబర్ బస్సు డ్రైవర్ విజయేందర్ పై తాడికల్ గ్రామానికి చెందిన గాలిపల్లి అనిల్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తుండగా... అదే సమయంలో బస్సుకు ఎదురుగా గాలిపల్లి అనిల్ బైక్ మీద వస్తున్నాడు. ఈ సమయంలో అనిల్ బస్సు తన మీదికే వస్తుందని భ్రమపడ్డాడు. దీంతో వెంటనే బస్సుకు అడ్డం తిరిగి కోపంతో బైక్ బస్సు ఎదురుగా నిలిపాడు. బస్సును ఆపి లోపలికి ప్రవేశించి డ్రైవర్ పై ఆలోచన లేకుండా విచక్షణారహితంగా చెప్పు తో దాడి చేశాడు. దాడి చేసిన అనిల్ అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ సంఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ తతంగం అంతా చూస్తున్న ప్రయాణీకులు, కండక్టర్ కలుగ చేసుకుని అనిల్ అనే వ్యక్తిని పట్టుకుని అదే బస్సులో సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అకారణంగా డ్రైవర్ పై దాడికి పాల్పడినట్లు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి జరుగుతున్న తరుణంలో బస్సులోని ప్రయాణికులు కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అనిల్ ను శంకరపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు.
వికారాబాద్ డిపో డ్రైవర్ పై దాడి
ఇటీవల వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాములు పై నవాజ్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. టిఫిన్ చేసేందుకు బస్సు ఆపడంతో డ్రైవర్, కండక్టర్‌పై నవాజ్ విరుచుకుపడ్డాడు. ఇలాగైతే బస్సు లేటవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టిఫిన్ చేసి ఐదు నిమిషాల్లో బయలుదేరుదామని నచ్చజెప్పినా అతడు వినలేదు. బూతులు తిడుతూ నవాజ్ వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో డ్రైవర్లు బస్సులను ఎక్కడివక్కడ నిలిపివేశారు. రాములుపై దాడిచేసిన నవాజ్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిపోకు చెందిన 45 బస్సులు డ్రైవర్ల నిరసన కారణంగా నిలిచిపోవడంతో వికారాబాద్, తాండూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.